Breaking News

అమెరికా యుద్దోన్మాద చర్యలు ప్రతిఘటించాలి

-ప్రపంచ శాంతి పరిరక్షణే ఏకైక లక్ష్యం
-మోదీ ఇజ్రాయిల్ పర్యటనతో ఉద్రిక్తతలు
-కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలి
-సీపీఐ, సీపీఎం నేతలు ఈశ్వరయ్య, శ్రీనివాసరావు
-అఖిల భారత శాంతి సంఘం నేతృత్వంలో నిరసన గళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దేశాలు సాగిస్తున్న యుద్ధోన్మాద చర్యలను సమైక్యంగా ప్రతిఘటించాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించడమే ప్రతి ఒక్కరి ఏకైక లక్ష్యం కావాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని సాధారణ ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని, వివిధ దేశాలపై ఆంక్షలు విధించడం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులపై చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (అయిప్సో) శాంతి స్నేహ సంఘం (ఇస్కఫ్) ఆధ్వర్యంలో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై కొనసాగిస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని, యుద్ధోన్మాద చర్యలను నిర్మూలించాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలోని లెనిన్‌సెంటర్ వద్ద నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, శాంతి స్నేహ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రపంచ శాంతి పరిరక్షణే మనందరి లక్ష్యమని, తక్షణమే అమెరికా తన యుద్ధోన్మాద చర్యల్ని విరమించుకోవాలని నినదించారు. యుద్ధాన్ని ప్రోత్సహించే ఇలాంటి విధానాలు అంతర్జాతీయ స్థాయిలో మరింత అస్థిరతకు దారితీస్తాయని, కావున ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి ప్రియులు, మానవతావాదులు యుద్ధానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, ఇరాన్ ప్రజలు తమ దేశ రక్షణ కోసం ప్రతిఘటిస్తున్నప్పటికీ, ఆ దేశంపై శక్తివంతమైన ఆయుధ సామర్థ్యం కలిగిన దేశాలు సైనిక బలం ప్రదర్శించడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని అవలంబించాల్సిన అవసరముందని,అంతర్జాతీయ వేదికలపై సముచిత రీతిలో స్పందించాలని సూచించారు. భారతదేశ విదేశాంగ విధానం స్వతంత్రత, అహింసా సూత్రాలు మరియు స్వాతంత్య్రోద్యమ విలువలను ప్రతిబింబించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విలువలు దెబ్బతింటున్నాయని ఆయన విమర్శించారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై ముందస్తు హెచ్చరికలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఇలాంటి సందర్భాల్లో పారదర్శకత ఎంతో అవసరమని తెలిపారు. అమెరికా ప్రపంచ రాజకీయాల్లో పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేసే విధానాలను అనుసరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాలపై జోక్యం చేసుకోవడం, సైనిక చర్యలకు పాల్పడడం అంతర్జాతీయ శాంతి భద్రతలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలు మహిళలు, పిల్లలు మరియు సాధారణ పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసి మానవీయ సంక్షోభాలను సృష్టిస్తాయని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరుకునే ప్రజలు యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా స్వరాన్ని ఎత్తుతున్నారని, ఈ తరహా దాడులను ఖండించడం ప్రతి శాంతికాముకుడి బాధ్యత అని ఆయన నొక్కిచెప్పారు. భారతదేశం తన విదేశాంగ విధానంలో సమతుల్య దృక్కోణాన్ని అవలంభిస్తూ, శాంతి, సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అంతర్జాతీయ వేదికలపై యుద్ధ విరమణకు, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచ దేశాల సహజ వనరులపై ఆధిపత్యం సాధించాలనే ధోరణి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు దారితీస్తోందని, విశ్వశాంతి సాధన అనేది ప్రతి దేశం లక్ష్యంగా పెట్టుకోవలసిన ప్రాధాన్య కర్తవ్యమని చెప్పారు. భారతదేశం చారిత్రాత్మకంగా అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించిన దేశంగా గుర్తింపు పొందిందని, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో సమతుల్యతను పాటిస్తూ శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉండటమే మన విదేశాంగ విధానపు ముఖ్య లక్షణమని తెలిపారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన అనంతరం ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, యుద్ధోన్మాదం కన్నా శాంతి సాధనే మానవ సమాజానికి శ్రేయస్కరమని ఆయన స్పష్టంగా తెలియజేశారు.

వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, రెండు రోజులుగా అమెరికా`ఇజ్రాయిల్ దేశాలు సమన్వయంతో ఇరాన్‌పై విస్తృత స్థాయిలో దాడులు జరిపుతున్నాయని మండిపడ్డారు. ఈ దాడుల ఫలితంగా విద్యార్థులు సహా అనేకమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, సైనిక స్థావరాలపై భారీ విధ్వంసం సృష్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు ఎటువంటి న్యాయసమ్మతమైన కారణం లేదని, అంతర్జాతీయ చట్టాలను పక్కనబెట్టి ఆర్థిక ఆధిపత్యం, ముఖ్యంగా చమురు వనరులపై నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. చమురు వనరులను స్వాధీనం చేసుకుని ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించడం ద్వారా ఇతర దేశాలపై ఆర్థిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని, ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతాన్ని అశాంతికి గురిచేస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు ప్రసాద్, పోలారి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, ఏఐపీఎసఓ రాష్ట్ర కన్వీనర్లు మహంకాళి సుబ్బారావు, ఎన్.సతీశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబీ, ఏఐపీఎసఓ నాయకులు సయ్యద్ రఫీ, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాగితాల రాజశేఖర్, మాజీ ప్రొఫెసర్ అంజయ్య,ఏపీ మహిళా సమాఖ్య నాయకులు పంచదార్ల దుర్గాంబ, ఓర్సు భారతి, ప్రోగ్రెసివ్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు అక్కినేని చంద్రారావు, తాజా రావు, ప్రముఖ సాహితీవేత్తలు దివికుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.మాల్యాద్రి, డీవైఎఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, సీఐటీయూ నాయకులు సూర్యారావు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు యడ్ల కృష్ణ కిషొర్, శాంతి నాయకులు అజమ్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్, రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య, నాయకులు అనిల్ తదితరులు యుద్ధ వ్యతిరేక అభ్యుదయ గేయాలను ఆలపించి నిరసనను ఉధృతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *