న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుమందుల నాణ్యత, కల్తీ, ఒకే రసాయన కూర్పుతో ఉన్న ఎరువులను భిన్న బ్రాండ్ పేర్లతో వివిధ ధరలకు విక్రయించడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. రైతులు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఒకే రకమైన ఎరువులను వివిధ పేర్లతో అమ్ముతూ రైతులను గందరగోళానికి గురిచేసే వ్యాపార విధానాలను నియంత్రించే ప్రణాళికలు, అలాగే ఎరువుల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలలను రాష్ట్రాల వారీగా ఏర్పాటు, ఇందులో బాగంగా తిరుపతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసే అవకాశముందా అని ఆయన ప్రశ్నించారు.
ఎంపీ గురుమూర్తి వేసిన ఆన్ స్టార్ ప్రశ్నకి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో పురుగుమందుల తయారీ, దిగుమతి, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని 1968 పురుగుమందుల చట్టం, 1971 నిబంధనల ప్రకారం నియంత్రిస్తున్నామని తెలిపారు. రైతులకు భద్రతతో పాటు ప్రభావవంతమైన పురుగుమందులు అందుబాటులో ఉండేలా కేంద్ర పురుగుమందుల మండలి మరియు నమోదు కమిటీ పర్యవేక్షణలో అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే ఎరువుల నాణ్యతను నిర్ధారించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించకుండా ఎరువుల తయారీ లేదా విక్రయం చేయడం నిషేధమని, ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు 1985 ప్రకారం కఠిన నియంత్రణలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
రైతుల్లో గందరగోళం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం “ఒక దేశం ఒక ఎరువు” విధానాన్ని అమలు చేస్తూ “భారత్” అనే ఒకే బ్రాండ్ పేరుతో యూరియా, డీఏపీ, పొటాష్, ఎన్‌పీకే వంటి ఎరువులను సరఫరా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎరువుల నాణ్యతను పరీక్షించేందుకు మొత్తం 84 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. అందులో నాలుగు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఫరీదాబాద్, నవి ముంబై, చెన్నై, కల్యాణి నగరాల్లో ఉండగా, మిగతా 80 ప్రయోగశాలలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, బాపట్ల, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఎరువుల నాణ్యత పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News