-జిల్లాలో రోజుకు 12 వేలకుపైగా గ్యాస్ సిలిండర్ల సరఫరా – అవసరానికి మించి బుకింగ్లు చేయవద్దు
-సాధారణ కంటే 90 శాతం పెరిగిన గ్యాస్ బుకింగ్లు – FIFO విధానంలో సిలిండర్ల డెలివరీ కొనసాగుతోంది
-గోకవరం, విశాఖపట్నం, విజయవాడ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి సజావుగా ఎల్పీజీ సరఫరా : కలెక్టర్ కీర్తి చేకూరి
-వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ – హెల్ప్ లైన్ 8074661259 : కలెక్టర్ కీర్తి చేకూరి
-తప్పుడు సమాచారంతో అధిక బుకింగ్లు చేయవద్దు – అవసరమైతే మాత్రమే గ్యాస్ బుక్ చేయాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాట్సాప్, మిస్డ్ కాల్ ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేయడం జరుగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో గృహ అవసరాల వినియోగం మరియు అత్యవసర సేవల కోసం ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు గ్యాస్ పంపిణీదారులతో జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12 వేల నుండి 12,500 వరకు ఎల్పీజీ సిలిండర్లు 52 మంది గ్యాస్ పంపిణీదారుల ద్వారా వినియోగదారులకు సరఫరా అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని గ్యాస్ పంపిణీదారుల వద్ద సుమారు 17,360 సిలిండర్లు నిల్వగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
సాధారణంగా రోజుకు 11 వేల నుండి 11,500 వరకు గ్యాస్ రీఫిల్ బుకింగ్లు ఉండేవని, అయితే ఇటీవల రోజుకు సగటున 22 వేల నుండి 22,500 వరకు బుకింగ్లు నమోదవు తున్నాయని వెల్లడించారు. అంటే సాధారణ బుకింగ్లతో పోలిస్తే దాదాపు 90 శాతం పెరుగుదల కనిపిస్తున్నదని తెలిపారు. అయితే సిలిండర్ల డెలివరీలు సీరియల్ (FIFO) పద్ధతిలో కొనసాగుతుండటంతో కొంత ఆలస్యం జరిగినట్లు వినియోగదారులకు అనిపించే అవకాశముందని వివరించారు.
జిల్లాకు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని బాట్లింగ్ ప్లాంట్లు సజావుగా పనిచేస్తున్నాయని, అక్కడ సరిపడా నిల్వ కూడా ఉందని కలెక్టర్ తెలిపారు. అక్కడి నుండి ప్రతి రోజూ జిల్లాలోని గ్యాస్ పంపిణీదారులకు సిలిండర్ల సరఫరా కొనసాగుతోందని చెప్పారు.
కావున వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. తప్పుడు సమాచారంతో అధికంగా బుకింగ్లు చేయడం లేదా సిలిండర్లను నిల్వ ఉంచుకోవడం చేయకుండా, అవసరం మేరకు మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే హెల్ప్‌లైన్ నెంబర్ 8074661259 కు సంప్రదించాలని సూచించారు.
ఒకేసారి అధిక సంఖ్యలో రీఫిల్ బుకింగ్లు చేయడం వల్ల కొంతమంది వినియోగదారులకు కాల్స్ కనెక్ట్ కాకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో ఆయిల్ కంపెనీలు అందించిన నంబర్లకు వాట్సాప్ ద్వారా లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
భారత్ గ్యాస్ వినియోగదారులు
వాట్సాప్ ద్వారా: 1800 22 4344 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపాలి
ఎస్‌ఎంఎస్ ద్వారా: 7710955555
ఇతర బుకింగ్ నంబర్లు: 7715012345 / 7718012345
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు
వాట్సాప్ ద్వారా: 7588888824 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపాలి
ఎస్‌ఎంఎస్ ద్వారా: 8454955555
ఐవీఆర్ఎస్: 7718955555
హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు
వాట్సాప్ ద్వారా: 9222201122 నంబర్‌కు HPGAS లేదా AG అని మెసేజ్ పంపాలి
ఎస్‌ఎంఎస్ ద్వారా: 9493602222
ఇతర బుకింగ్ నంబర్లు: 8888823456 / 9666023456
Prajavartha Online Telugu News