-జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగ దారుల కోర్టు కేసులు రాజీ ద్వారా పరిష్కారం – చెక్కుల అందచేత/ పంపిణీ, అవార్డులు జారీ
-18,441 కేసులు పరిష్కారం రూ.58.16 కోట్ల పరిహారం చెల్లింపు
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కక్షిదారులు సామరస్యం, సంధి చేసుకునే నైజం కలిగి లోక్ అదాలత్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) ఛైర్మన్ గంధం సునీత సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పలు మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగదారుల కోర్టు కేసులు తదితర కేసులు మధ్యవర్తిత్వం ద్వారా విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. రాజీ కుదిరిన అనంతరం బాధితులకు మంజూరైన పరిహారానికి సంబంధించిన చెక్కులు, అవార్డ్ పత్రాలను న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులు పంతాలకు పోకుండా పరస్పర అవగాహనతో రాజీకి రావడం ద్వారా సమయం, ఖర్చు రెండూ , కోర్టుల విలువైన సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులలో మధ్యవర్తిత్వం ద్వారా రాజీ సాధ్యమయ్యే కేసులను గుర్తించి ఈ లోక్ అదాలత్ లో ఇరుపక్షాలను చర్చించి సమ్మతి లభించిన కేసులను పరిష్కరించడం జరుగు తుందని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 47 బెంచ్‌లు ఏర్పాటు చేసి, కక్షిదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులలో లబ్ధిదారులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో గణనీయమైన సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,441 కేసులు పరిష్కరించబడినట్లు తెలిపారు. ఇందులో 630 సివిల్ కేసులు, 17,672 క్రిమినల్ కేసులు, అలాగే 139 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయి. వీటిలో పెండింగ్ కేసులు పరిష్కారమవడం ద్వారా బాధితులకు, కక్షిదారులకు వేగంగా న్యాయం అందింది. రూ.58,15,99,389 /-లను పరిహారం అందచేయడం జరిగింది.
పరిష్కారమైన కొన్ని కేసులు:
పీడీజే కోర్టు పరిధిలోని ఎం.వి.ఓ.పి. నెం. 275/2025 కేసులో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున బాధితులకు రూ.75 లక్షల పరిహారం మంజూరు చేయబడింది. పీడీజే కోర్టులోని ఎం.వి.ఓ.పి. నెం. 211/2022 కేసులో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బాధితులకు రూ.39 లక్షల పరిహారం మంజూరైంది. అదేవిధంగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు పరిధిలోని ఎం.వి.ఓ.పి. నెం. 296/2025 కేసు చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో రాజీ కుదిరి రూ.55 లక్షల పరిహారం మంజూరు చేయడం ద్వారా పరిష్కారమైంది.
పలు కేసుల పరిష్కారంలో సంబంధిత పిటిషనర్ కౌన్సెల్స్, ఇన్సూరెన్స్ కంపెనీల స్టాండింగ్ కౌన్సెల్స్ పరస్పర సహకారంతో మధ్యవర్తిత్వం విజయవంతమై బాధితులకు తక్షణ న్యాయం లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు వేగంగా పరిష్కారమవడం వల్ల బాధితులకు న్యాయం త్వరితగతిన అందు తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు సూచించారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం. మాధురి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం జిల్లా కోర్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి, పలువురు న్యాయవాదులు, కక్షిదారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News