Breaking News

జిల్లాలో దివ్యాంగ శక్తి (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం)పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎం.ఎల్.ఎ.

-దివ్యాంగులకు స్వేచ్చగా ప్రయాణం, సమాజంలో భాగస్వామ్యం, జీవన ప్రమాణాల మెరుగుదల కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
-దివ్యాంగులపై ఉండే ఆర్ధిక బారం తగ్గించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం: ఎం.ఎల్.ఎల్ ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, గౌరవప్రద జీవనానికి కట్టుబడి “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక తిరుపతిలోని అలిపిరి బస్ డిపో నందు ఏర్పాటు చేసిన దివ్యంగ శక్తి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, హస్తకళాభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వన్నె కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి.ఆర్. రాజన్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివమ్ లతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు స్వేచ్చగా ప్రయాణం, సమాజంలో భాగస్వామ్యం, జీవన ప్రమాణాల మెరుగుదల కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగా నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ పథకం ప్రారంభమైందని, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా నెలకు రూ.6 వేలు పెన్షన్, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు వరకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోనే 30 వేలకు పైగా మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు APSRTC ద్వారా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని 40% పైగా వికలాంగత కలిగిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో 5385 మంది పి.హెచ్.సి పాసులు ఉన్న దివ్యాంగులు ఉన్నారని ఈ పథకం అమలు ద్వారా దివ్యాంగులకు సంవత్సారానికి రూ. 12 కోట్ల 78 లక్షలు ఆదాయం చేకూరనున్నదని తెలిపారు. సప్తగిరి, అల్ట్రా డీలక్స్ వంటి కొన్ని సేవల్లో 50% రాయితీ కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. అవసరమైన వారికి సహాయకులకు కూడా 50% రాయితీ వర్తిస్తుందని తెలిపారు. బస్సు ప్రయాణ సమయంలో దివ్యాంగులకు సౌకర్యం కల్పించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ర్యాంపుల వినియోగం, ప్రత్యేక సీట్ల కేటాయింపు, ఎక్కడం-దిగడంలో సహాయం వంటి అంశాల్లో సిబ్బంది సున్నితంగా వ్యవహరించాలన్నారు.

పిడబ్ల్యూడీ (PwD) కార్డు పొందేందుకు సదరం సర్టిఫికేట్ ఆధారంగా సులభ విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నమోదు, సహాయం అందించాలన్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో దివ్యాంగుల అవసరాలు గుర్తించి, అవసరమైన ఉపకరణాల కోసం అంచనాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మే-జూన్ నెలల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరు-తిరుపతి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామని చెప్పారు. దివ్యాంగులపై అవగాహన పెంపొందించేందుకు “వికలాంగులు” అనే పదం స్థానంలో “దివ్యాంగులు” అనే గౌరవప్రద పదాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా అర్హత ఉన్న వారు సదరం సర్టిఫికేట్ పొందాలని, తప్పుదోవ పట్టించే వ్యక్తులను నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు.

తిరుపతి ఎం.ఎల్. ఏ ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ…. ఎన్నికల్లో భాగంగా మాట ఇచ్చిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు . తిరుపతి నియోజకవర్గంలో దాదాపు చాలామంది దివ్యాంగులు ఉన్నారనీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం వీరికి ఎంతగానో ఉపయోగపడనన్నుదని అన్నారు. మన జిల్లాలో పది డిపోల బస్సుల్లో ఇప్పటికే 307 బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణిస్తున్నారనీ, అలాగే దివ్యాంగులకు కూడా మరో 327 బస్సులు కూడా ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా సుమారుగా 600 బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ వసతి కల్పించే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దివ్యాంగులతో పాటుగా వారి సహాయకులు కూడా టికెట్టులో 50 శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడo మంచి విషయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటికే స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రవేశ పెట్టగా ఇప్పుడు దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ స్థానిక ఎం.ఎల్.ఎ, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి జిల్లాలో దివ్యంగ శక్తి పథకాన్ని జండా ఊపి ప్రారంభించారు. ఆర్డినరి, ఎక్స్ ప్రస్ బస్సులలోని దివ్యాంగ ప్రయాణికులకు ఉచిత బస్ టికెట్ లను అందించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిజనల్ మేనేజర్ జగదీష్,నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ జనరల్ సెక్రెటరీ విజయ శేఖర్ రెడ్డి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, పిడబ్ల్యుడి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ శారీరక దివ్యంగా ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు ప్రకాష్, ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది, దివ్యాంగుల సంఘ నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *