-రూ.15 కోట్ల వ్యయంతో అద్భుతంగా నూతన ఆలయ నిర్మాణం
-అనకాపల్లి వాసుల కోరిక మేరకు రాష్ట్ర పండుగగా నూకాంబికా అమ్మవారి జాతర
-ప్రభుత్వం తరఫున నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర
అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్రవాసుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంభిక అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎంపీ సీఎం రమేశ్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.
సుమారు రూ.15 కోట్ల వ్యయంతో నూతన ఆలయ నిర్మాణ చేపట్టడం సంతోషంగా ఉంది. ఎంతో ఘనకీర్తి కలిగిన అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా.. నేడు తొలి అమావాస్య సందర్భంగా నిర్వహించే జాతరలో పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీ మేరకు నేడు అధికారికంగా జాతర నిర్వహించడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తులకు అద్బుతమైన ఏర్పాట్లు చేసిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ కృషికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం తాకాశి వీధిలో గల చిన్న నూకాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యన్నారాయణ, గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, టీడీపీ నేత దాడి రత్నాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News