– జిల్లా ప్రజలకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఉగాది శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజ్ఞానం, అహంకారం, బలహీనతలను జయించి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రతీక అయిన శ్రీ పరాభవనామ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త విజయాల వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల సంస్కృతిలో ఉగాది పండుగకు విశిష్ట స్థానం ఉందని, ఇది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా ఆలోచనలు, ఆశయాలను పునర్నిర్మించుకునే ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని సుఖదుఃఖాలను సూచిస్తాయని, కష్టాలను కూడా సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతికూల ఆలోచనలను దూరం చేసి సానుకూల దృక్పథంతో జీవించాలని, అహంకారాన్ని విడిచి వినయంతో ముందుకు సాగితే సమాజం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ ఉగాది ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఎన్‌టీఆర్ జిల్లా విద్య, వ్యవసాయం, వాణిజ్యం పారిశ్రామిక, పర్యాటకం తదితర రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News