Breaking News

మంచి జరగాలంటే మంచి పాలకులే ఉండాలి…

-దివ్యాంగ శక్తి పథకంతో లబ్దిదారులకు ఆర్థిక వెసులుబాటు
-ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు-
-దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం మంగళగిరి నుంచి పెనుమాక వరకూ సీఎం ప్రయాణం
సీఎంతో పాటు అదే బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంచి జరగాలంటే మంచి వ్యక్తులు, మంచి పార్టీ అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి గురించి దివ్యాంగులు ప్రజలకు తెలియజేయాలని, మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో కలిసి మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు ఉచిత టికెట్‌ను సీఎం అందించారు. ఈ సందర్భంగా వారితో కాసేపు సంభాషించారు. వారి కష్ట సుఖాలు… కుటుంబ నేపథ్యం వంటివి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ….రూ.500 ఉండే పింఛనును 2014లో తాను అధికారంలోకి వచ్చాక రూ.1500 చేశానని, ఆ తర్వాత రూ.3000లకు పెంచానని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఒకేసారి రూ.6000కు పెంచామన్నారు. గతంలో దివ్యాంగులకు చేయూత కార్యక్రమం ద్వారా పరికరాలు అందించామని, మీలో మనోధైర్యం రావాలనే కార్యక్రమాలు చేపట్టామని వారితో అన్నారు.

*దివ్యాంగ శక్తి పథకంతో ఆర్థికంగా ఉపయోగం*

దివ్యాంగులకు చేయూతనిస్తే సమాజంలో అందరితో సమానంగా ముందుకు వెళతారని సీఎం అన్నారు. ‘సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఇస్తున్నాం. అందులో దివ్యాంగులకూ కొంత ఎక్కువగా ఇస్తున్నామంటే… మీలో ఆత్మ విశ్వాసం కలిగించడం కోసమే. దివ్యాంగుల పెన్షన్ను 12 ఏళ్లలో 12 రెట్లు పెంచాను. దివ్యాంగ శక్తి పథకం మీకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. మీలో మనోధైర్యం రావాలి. ’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ… ఛార్జీల రూపంలో తమకు ఖర్చు అయ్యే రూ.1500 వరకూ తమకు మిగులుబాటు అవుతుందని అన్నారు.

*దివ్యాంగుల భావోద్వేగం*

తమకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న మేలుపై సీఎంతో పలువురు దివ్యాంగులు పంచుకున్నారు. మంగళగిరికి చెందిన ఓ దివ్యాంగుడు మాట్లాడుతూ…. తనకు కీళ్లవాతం రావడంతో వెన్నుపూస దెబ్బతిందని… ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3 లక్షలు అందించడంతో ఆపరేషన్ విజయవంతంగా చేయించుకున్నానని తెలిపారు. మరో దివ్యాంగుడు మాట్లాడుతూ… తమ దంపతులిద్దరికీ దివ్యాంగుల పింఛను వస్తోందని, గతంలో వేరే ఊరు వెళ్లాలంటే బస్ ఛార్జీలకు రూ.1500 వరకూ ఖర్చయ్యేదని, ఇప్పుడు అవి మిగులుతున్నాయని తెలిపారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారని, క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారని మరో దివ్యాంగుడు వివరించారు. మాకోసం మీరు చేస్తున్న సాయానికి మాటలు రావడం లేదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉండాలని దివ్యాంగులు ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *