– సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన అకాల వర్షాలు తీవ్ర గాలుల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాగేశ్వరరావు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా నుండి ఏలూరు జిల్లా వరకు నిన్న రాత్రి, ఈరోజు కురిసిన వడగండ్ల వాన, అకాల వర్షం, గాలుల తీవ్రత కారణంగా వేలాది మంది రైతులకు చెందిన దాదాపు 3 వేలకు పైగా ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. బొప్పాయి, అరటి, మొక్కజొన్న, మామిడి, దానిమ్మ, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో ఈ నష్టం రైతుకు కోలుకోలేని దెబ్బతీసింది. అప్పులు చేసి పంటలు పెట్టిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా సత్య సాయి, అనంతపురం, నెల్లూరు, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకొని, పూర్తి నష్టపరిహారం అందించాలని కోరుతున్నా.ము.
Prajavartha Online Telugu News