-వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంద
-యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి
-మంత్రి ఎస్ సవిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమందరం ఇచ్చే ఘన నివాళి అని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించి కష్టపడి ఎదిగి, ప్రజల సమస్యలను తనవిగా భావించి సేవలందించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడిచి ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని మంత్రి తెలిపారు. బీసీ సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సభాధ్యక్షులు, శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. యువత ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, తమ ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో యువశక్తి కీలకమని పేర్కొన్నారు. సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో ప్రజాసేవాభావంతో పనిచేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. చేతివృత్తుల వారు, చిన్నతరహా వ్యాపారులు, స్వయం ఉపాధి దారులకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తూ విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందని గుర్తుచేశారు. శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ శెట్టిబలిజ సమాజానికి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం గర్వకారణమన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ శెట్టిబలిజ జాతి గౌరవాన్ని కాపాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. సమాజంలో సమాన అవకాశాల సాధనకు జ్యోతిరావ్ ఫూలే వంటి మహనీయులు చేసిన సేవలను స్మరించారు. అలాగే ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కూడిపూడి సత్తిబాబు మాట్లాడుతూ
– దొమ్మేటి వెంకటరెడ్డి గారి సేవలు బీసీ సమాజానికి మార్గదర్శకమన్నారు.
– ఆయన ఆశయాల సాధనకు సమాజం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవకు అంకితమైన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ప్రజాసేవ అంటే పదవి కాదు బాధ్యత అనే భావనతో ఆయన పనిచేశారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, వెనుకబడిన వర్గాల సంక్షేమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరపున ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అధికారులు, మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News