Breaking News

ఇన్సాల్వెన్సీ (దివాళా) సవరణ బిల్లుపై లోక్‌సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కీలక ప్రసంగం

న్యూఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త :
లోక్‌సభలో బుధవారం జరిగిన ఇన్సాల్వెన్సీ (దివాళా) సవరణ బిల్లు-2025పై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. వ్యాపార సంస్థల ఆర్థిక సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక ముందడుగు అని ఆయన స్వాగతించారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల్లో ఉన్న కంపెనీల కేసులను 14 రోజుల్లోగా విచారణకు స్వీకరించాలనే నిబంధన వల్ల అనవసర జాప్యం తగ్గి, రికవరీ వేగవంతం అవుతుందని చెప్పారు. అలాగే, ఒక కంపెనీ పూర్తిగా మూతపడకుండా వ్యాపారం కొనసాగిస్తూనే తమ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం కల్పించడం, మోసపూరిత లావాదేవీలను సులభంగా గుర్తించేలా చట్టంలో మార్పులు తీసుకురావడాన్ని ఆయన సమర్థించారు. అయితే, ఈ చట్టం ఆశించిన స్థాయిలో విజయవంతం కావాలంటే సరైన రక్షణ చర్యలు, సంస్థాగత సామర్థ్యం పెంపు చాలా అవసరమని ఎంపీ ప్రభుత్వానికి గుర్తుచేశారు. నిర్దేశించిన సమయంలోగా కేసులను పరిష్కరించేలా ఎన్సీఎల్టీ కోర్టుల పనితీరును, సామర్థ్యాన్ని తక్షణమే పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా చట్టం అమలులో ఉన్న కొన్ని సందేహాలపై కేంద్ర మంత్రిని ఆయన వివరణ కోరారు. అసాధారణ పరిస్థితుల్లో కేసులను వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి నిబంధనలు పెడతారు, రోజువారీ వ్యాపార సేవలు అందించే ఆపరేషనల్ అప్పుదారులకు ఎలాంటి నష్టం జరగకుండా సమాన న్యాయం ఎలా చేస్తారు, ప్రక్రియను సులభతరం చేసిన తర్వాత అప్పు ఇచ్చిన వారి హక్కులను ఎలా కాపాడతారు, అలాగే, మోసపూరిత లావాదేవీలను కచ్చితంగా నిర్ధారించడానికి ఎలాంటి సాక్ష్యాలను ప్రామాణికంగా తీసుకుంటారు, అనే కీలక అంశాలపై ప్రభుత్వ పరంగా స్పష్టత ఇవ్వాలని కోరారు.

చివరగా, అప్పులకు గ్యారంటీ ఇచ్చిన వారి బాధ్యతలపై కూడా స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలకు రక్షణ కల్పించడంతో పాటు, సంబంధం లేని వ్యక్తులపై ఎలాంటి అనవసర చర్యలు లేకుండా చూడాలని ఎంపీ గురుమూర్తి సూచించారు. సరైన భద్రతా చర్యలు, స్పష్టమైన విధివిధానాలతో ఈ చట్టాన్ని అమలు చేస్తే దేశంలో ఒక సమర్థవంతమైన, న్యాయమైన పరిష్కార వ్యవస్థ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ పార్టీ తరపున బిల్లుకు మద్దతు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *