– గత 3 నెలల్లో 9,183 మంది గుండెపోటు బాధితులకు పునర్జన్మ
– కాలంతో పోటీపడి ప్రాణాలు కాపాడుతున్న 108 అత్యవసర సేవలు
అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 108 అత్యవసర సేవలు అత్యంత వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన గుండెపోటు (Cardiac Emergencies) కేసుల్లో సమయానుకూలంగా స్పందించి, గత మూడు నెలల కాలంలోనే 9,183 మంది బాధితులను మృత్యువు అంచున నుంచి కాపాడటం ఒక విశేష విజయంగా నిలిచిందని 108 సేవల విభాగం వెల్లడించింది. 108 అంబులెన్స్ సేవలు కేవలం రవాణా వ్యవస్థ కాకుండా, అత్యవసర వైద్య సేవల మొబైల్ విస్తరణగా పనిచేస్తూ, ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సమగ్ర ప్రీ-హాస్పిటల్ కేర్, శిక్షణ పొందిన సిబ్బంది, ఆధునిక సాంకేతికత, 24/7 వైద్య పర్యవేక్షణతో 108 సేవలు ప్రజలకు భరోసానిచ్చే ప్రాణదాతగా నిలుస్తున్నాయి.
గుండెపోటు వచ్చిన తర్వాత తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఈ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ కీలక సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది వేగంగా స్పందించి, సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లోనే ప్రాథమిక అత్యవసర చికిత్స అందించడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నారు.
108 అంబులెన్స్ సేవలు కేవలం రోగులను ఆసుపత్రికి తరలించడమే కాకుండా, ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణరక్షక వైద్య సేవలను అందిస్తున్నాయి. శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (EMTs) రోగి పరిస్థితిని అంచనా వేసి, ఆక్సిజన్ అందించడం, CPR చేయడం, రక్తపోటు నియంత్రణ, బేసిక్ లైఫ్ సపోర్ట్ వంటి అత్యవసర చర్యలను వెంటనే ప్రారంభిస్తారు.
ప్రైవేట్ అంబులెన్స్‌లతో తేడా – 108 ప్రత్యేకత
ప్రైవేట్ అంబులెన్స్‌లు ప్రధానంగా రవాణాపైనే దృష్టి సారిస్తే, కూటమీ ప్రభుత్వంలో 108 సేవలు పూర్తి స్థాయి వైద్య సేవలను అందించే మొబైల్ ఎమర్జెన్సీ యూనిట్‌గా పనిచేస్తున్నాయి. వైద్య పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది, రియల్ టైమ్ వైద్య మార్గదర్శకంతో 108 సేవలు ప్రజలకు మరింత భరోసాను కల్పిస్తున్నాయి.
అత్యవసర ప్రసూతి సేవలు .. ప్రాణాలను కాపాడుతున్న సేవలు
తీవ్ర గర్భధారణ పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రసవం అవసరమైన సందర్భాల్లో, 108 EMTలు అంబులెన్స్‌లోనే సురక్షితంగా డెలివరీ నిర్వహించగల నైపుణ్యం కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ప్రాణరక్షకంగా నిలుస్తోంది.
అత్యవసర పరిస్థితుల్లో EMTలు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌లో ఉన్న వైద్యులతో (ERCP) నిరంతరం సంప్రదిస్తూ, రోగికి అవసరమైన చికిత్సను అందిస్తారు. ఇది రోగి పరిస్థితిని మరింత మెరుగుపరచడంలో కీలకంగా మారుతోంది.
24/7 వైద్య పర్యవేక్షణ & సాంకేతిక ఆధారం
108 సేవల్లో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారు. అంబులెన్స్‌లలో అమర్చిన డోమ్ కెమెరాల ద్వారా రోగి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, వైద్యులు సూచనలు ఇవ్వడం వల్ల సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతోంది. ఈ విధానం అత్యవసర వైద్య సేవల్లో ఒక ఆధునిక ముందడగా మారాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది, సమర్థవంతమైన కాల్ సెంటర్ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, సమీప ప్రాంతాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సురక్షితంగా తరలిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి స్పందన
గత మూడు నెలల్లో అందిన వేలాది అత్యవసర కాల్స్‌లో గుండెపోటుకు సంబంధించిన 9,183 కేసుల్లో వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడటం 108 సేవల సమర్థతకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సమానంగా సేవలు అందించడం విశేషం.
ప్రజలకు విజ్ఞప్తి
ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధికంగా చెమటలు పట్టడం వంటి గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా 108 నంబర్‌కు కాల్ చేయాలి. సమయానికి తీసుకున్న నిర్ణయం ప్రాణాలను కాపాడగలదు.
అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయని, ఈ ఉచిత సేవలను ప్రజలు నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని మీడియా సమన్వయకర్త కోరారు.
Prajavartha Online Telugu News