-ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ నాట్య కళాకారులు స్వర్గీయ శ్రీ నార్ని కేదారేశ్వరుడి జయంతి సందర్భంగా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జరిగిన సంగీత, సాంస్కృతిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కళా వైభవం పరిఢవిల్లడానికి నార్ని కేదారేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.గతంలోనే విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ఆయన అందించిన ఆర్థిక సాయం ఆయన దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. కళలను ప్రోత్సహిస్తున్న ‘రాకా’ సంస్థ నిర్వాహకులు రమణను, టీటీడీతో పాటు నాటి కమిషనర్ సుబ్బారావు, ఆనం కుటుంబీకుల సేవలను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందించారు.నార్ని కేదారేశ్వరుడిని స్మరించుకోకుండా రాజమండ్రి కళా చరిత్ర పూర్తి కాదని, ఆనం కళాకేంద్రం వంటి వేదికలు కళాకారులకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులను మంత్రి అభినందిస్తూ, కేదారేశ్వరుడి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నార్ని కేదారేశ్వరుడిని స్మరించుకునే అవకాశాన్ని కల్పించినందుకు రాకా సంస్థకు, నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమించబడిన జేవీ రమణకు ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News