-ఆస్తి, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్నే విస్మరించారు
-ఎంపీలు ‘ఆత్మహుతి దళం’ అని మాట్లాడుతుంటే అది పార్టీయా, ఉగ్రవాద సంస్థా?
-చంపేస్తాం, నరికేస్తాం అని బెదిరించే వైకాపా ఒక ‘గొడ్డలి పార్టీ’
-సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వీడియోలు
-నాసిరకం మద్యంతో వేల మంది ప్రాణాలు తీసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే
బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన అరాచక పార్టీ వైకాపా
-రాష్ట్రం నుంచి ఉన్మాద శక్తులను తరిమికొట్టాలి
-మంత్రి కొలుసు పార్థ సారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంటుంది.. “కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీద పడేసే వాడిని చూసి, నీ బతుకు చెడ ఎందుకు పుట్టావురా?” అని తిట్టుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే ఉందని హౌసింగ్, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అధికారం కోసం, ఆస్తి కోసం కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా లెక్కచేయకుండా, తన రక్త సంబంధీకుల చేతే శాపనార్థాలు పెట్టించుకునే స్థాయికి ఆయన దిగజారిపోయారని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని ఈరోజు జగన్ బజారున పడేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అరాచక విధానాలు, ఆ పార్టీ నాయకుల ఆలోచనా ధోరణిని చూస్తుంటే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్ఖైదా, ఐసిస్ (ISIS)వంటి వాటికి వీరికి పెద్ద తేడా లేదనిపిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలు సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించకుండా, భయాందోళనలు సృష్టించడం ద్వారా తమ సిద్ధాంతాలను ప్రజలపై రుద్దాలని చూస్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా అదే బాటలో నడుస్తోంది. బాంబులు వేయడం, మారణాయుధాలతో దాడులు చేయడం ద్వారా ప్రజల్లో భయాన్ని నింపి, దాని ద్వారా పబ్లిసిటీ పొందాలనేది ఉగ్రవాదుల వ్యూహం. వైకాపా నాయకులు కూడా అదే రకమైన అరాచక భాషను, దాడులను నమ్ముకున్నారు. అమాయక యువకుల్లో ఉండే భక్తిని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు వారిని ఎలాగైతే ఊబిలోకి లాగుతాయో, వైకాపా కూడా యువతను తప్పుదోవ పట్టిస్తోంది. ఉగ్రవాద సంస్థల మాదిరిగానే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు, తప్పుడు ప్రచారాల ద్వారా వైకాపా సమాజంలో విషాన్ని చిమ్ముతోంది. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి, అరాచకమే అజెండాగా సాగుతున్న వైకాపా విధానాలు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో గుర్తించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులు సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి వ్యవస్థలను, వనరులను ఎలాగైతే ధ్వంసం చేస్తారో, వైకాపా నాయకులు కూడా అదే బాటలో వెళ్తున్నారని విమర్శించారు. “జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది చేస్తాం.. అవసరమైతే ఆత్మహుతి దళంగా మారుతాం” అని మిథున్ రెడ్డి వంటి సీనియర్ ఎంపీ మాట్లాడటం చూస్తుంటే, ఇది ప్రజాస్వామ్య పార్టీనా లేక ఉగ్రవాద ముఠానా అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. చంపేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అని మాట్లాడే వారు ప్రజాస్వామ్యవాదులు ఎలా అవుతారని నిలదీశారు. తన సొంత తండ్రి, బాబాయి మరణాలను కూడా రాజకీయం కోసం ఆయుధాలుగా వాడుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నిరంతరం నరుకుతాం, చంపుతాం అని బెదిరించే వారి భాష ఉగ్రవాదుల కంటే ఘోరంగా ఉంది. అందుకే ప్రజలు వైకాపాను ఒక రాజకీయ పార్టీగా కాకుండా “గొడ్డలి పార్టీ”గా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా అయితే అభివృద్ధిని, వ్యవస్థలను కుప్పకూలుస్తాయో.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు కూడా రాష్ట్ర వనరులను, వ్యవస్థలను అదే విధంగా విధ్వంసం చేశారు. వీరి ఉన్మాదపూరిత భావజాలం రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు అని, ప్రజలందరూ ఈ అరాచక ధోరణిని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించే ఉగ్రవాదుల నోట మనం ‘ఆత్మహుతి దళం’ అనే మాట వింటాం. కానీ, దురదృష్టవశాత్తూ ఈరోజు వైకాపా ఎంపీలే తాము జగన్ కోసం ఆత్మహుతి దళాలుగా మారుతామని చెప్పడం వారి ఉన్మాదానికి పరాకాష్ట. “జగన్ ఏం చెబితే అది చేస్తాం” అనడం ప్రజాస్వామ్యమా లేక ముఠా పాలనా అని మంత్రి ప్రశ్నించారు. భారతదేశ చరిత్రను గమనిస్తే, గాంధీజీ, నెహ్రూ వంటి మహోన్నత నాయకుల కాలంలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. నాయకత్వం తీసుకునే నిర్ణయాల్లో తప్పులుంటే సుభాష్ చంద్రబోస్ వంటి వారు నిర్మొహమాటంగా వ్యతిరేకించారు. కానీ, వైకాపాలో నాయకులు తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, దోచుకున్నది దాచుకోవడం కోసం జగన్ చెప్పిన ప్రతి అరాచకానికి గుడ్డిగా తల ఊపుతున్నారు. ఇలాంటి “గుడ్డి విధేయత” భారత రాజకీయాల్లో ఎప్పుడూ లేదని గుర్తుచేశారు. బలహీన వర్గాలకు చెందిన తోట చంద్రయ్య గారు చేసిన తప్పేంటి? ఆయన ఏమైనా సమాజానికి నష్టం చేశారా? కేవలం ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు, ఆయనను తమ వైపు తిప్పుకోలేక నడిరోడ్డుపై దారుణంగా హత్య చేస్తారా? ఒక సామాన్య కార్యకర్తను కూడా బతకనివ్వని ఈ వికృత భావజాలం ఉగ్రవాదం కాక ఇంకేమిటని నిలదీశారు. వైకాపా పాలనలో ఎదురు తిరిగిన వారిని, ప్రశ్నించిన వారిని ఏ విధంగా అణచివేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని మంత్రి అన్నారు. రేపల్లెలో తన సోదరిని అవమానించారని ప్రశ్నించిన చిన్నారి అమర్నాథ్ గౌడ్‌ను అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేశారంటే వీరి ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్‌ను పిచ్చోడిగా ముద్రవేసి, వేధించి, చివరకు ప్రాణం పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక పార్లమెంట్ సభ్యుడిని అని కూడా చూడకుండా, తమను విమర్శించారనే నెపంతో కిడ్నాప్ తరహాలో అరెస్ట్ చేసి, కస్టడీలో హింసించి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉపాధి దొరకకుండా చేయడమే వైకాపా ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని మంత్రి ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే, వారిని బెదిరించేలా వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం, మీ అంతు చూస్తామని బెదిరింపులకు దిగడం వల్ల రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు వెనక్కి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “ప్రభుత్వం కంటే మెరుగ్గా సంక్షేమం అందిస్తాం” అని చెబుతుందని, కానీ వైకాపా మాత్రం కేవలం విద్వంసం, బెదిరింపులు, హత్యలే అజెండాగా పెట్టుకుందని మంత్రి మండిపడ్డారు. ఈ విధ్వంసక భావజాలం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఇందుకు భిన్నంగా ఉందని మంత్రి విమర్శించారు. తెనాలిలో గంజాయికి బానిస అయి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకుంటే.. జగన్ గారు స్వయంగా వెళ్లి అతన్ని పరామర్శించడం సిగ్గుచేటు. సమాజానికి హాని చేసే వారిని వెనకేసుకురావడం ఏ రకమైన రాజకీయం? రైతుల పరామర్శ పేరుతో జగన్ నిర్వహించిన ర్యాలీల్లో “నరుకుతాం.. చంపేస్తాం” అనే బోర్డులు పట్టుకోవడం, రపరప అంటూ నినాదాలు చేయడం చూస్తుంటే.. ఆయన సమాజంలోకి ఏ విధమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నారో ప్రజలు ఆలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో తమ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో క్వాలిటీ లేని, స్పూరియస్ మధ్యాన్ని సరఫరా చేశారు. ఆ మద్యం తాగి తమ కిడ్నీలు పాడైపోతున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రజలు మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం డబ్బు కోసం వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వైకాపాను ఉగ్రవాద పార్టీ అనడంలో తప్పులేదన్నారు. ఏ ప్రతిపక్షమైనా తాము వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం అని చెబుతుంది. కానీ వైకాపా మాత్రం కేవలం భయాందోళనలు సృష్టించి, పెట్టుబడిదారులను బెదిరించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాలని చూస్తోంది.
కొలంబియాలో పాబ్లో ఎస్కోబార్ కొకైన్ వ్యాపారంతో మాఫియా రాజ్యాన్ని ఏలి, “డబ్బు లేదా బులెట్” అనే సిద్ధాంతంతో నడిచాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాఫియా, ఉగ్రవాద భావజాలంతో “డబ్బు లేదా అధికారం” అనే సూత్రంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో భయం సృష్టించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన అమరావతిపై జగన్ తనకున్న ద్వేషాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చూపించారని గుర్తు చేశారు. తనకు నచ్చలేదనే ఒకే ఒక్క కారణంతో ప్రజావేదికను కూల్చివేసి వినాశనానికి నాంది పలికారు. అమరావతిని దెబ్బతీయడానికి ‘మూడు రాజధానుల’ అనే ఆచరణ సాధ్యం కాని ముసుగును తీసుకొచ్చి రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారు. తనను వ్యతిరేకించారనే కారణంతో శాసన మండలిని రద్దు చేయాలని చూసి, తీరా అవసరం పడేసరికి ‘మడం తిప్పిన’ చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు. సొంత చెల్లిని ఆస్తి విషయంలో ఇబ్బంది పెడుతున్న జగన్, భవిష్యత్తులో తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు కల్పించిన సమాన ఆస్తి హక్కును కూడా ఈ ఉగ్రవాద భావజాలం ఉన్న పార్టీ రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఇటువంటి ఉగ్రవాద శక్తులను అణచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రజల మీద కూడా ఉందని మంత్రి అన్నారు. గత ఎన్నికల్లో జగన్ తీరుకు ప్రజలు 11 సీట్లతో తగిన బుద్ధి చెప్పారు. కానీ భవిష్యత్తులో ఈ ఉగ్రవాద శక్తులు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలోపేతం చేయాలన్నారు. అధికారం కోసం వైకాపా ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందని చెప్పడానికి వివేకానంద రెడ్డి గారి మరణమే నిదర్శనమని మంత్రి విమర్శించారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి సొంత బాబాయి మరణాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి గారి శరీరంపై ఉన్న గాయాలను చూస్తే అది హత్య అని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ, అత్యంత దారుణంగా హింసించబడిన ఆ శవాన్ని చూసి కూడా, ‘గుండెపోటు’ అని ప్రచారం చేయగలిగిన ఘనత ఒక్క వైకాపాకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఒకవైపు ఉన్మాద శక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే, మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం ద్వారా ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. వైకాపా లాంటి అరాచక శక్తులు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ హింస, విద్వంసం, అరాచకాల ఊబిలోకి వెళ్తుందని.. ప్రజలందరూ ఈ విషయాన్ని లోతుగా ఆలోచించాలని మంత్రి కోరారు. కేవలం అధికారం కోసం కుటుంబాన్ని, వ్యవస్థలను, చివరకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ఉగ్రవాద భావజాలాన్ని శాశ్వతంగా నాశనం చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. అరాచక శక్తులను నామరూపాలు లేకుండా చేసి, అభివృద్ధికి అండగా నిలవాలని మంత్రి రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News