-అద్భుతం.. ఆనంద అంబరం
-వైభవంగా ప్రారంభమైన సాంస్కృతిక వారసత్వ ఉత్సవం
-కొండపల్లి బొమ్మల ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చే గొప్ప ప్రయత్నం
-ఏటా ఏప్రిల్ 18 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్
-మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్న డిజైన్ల అభివృద్ధికి ప్రోత్సాహం
-కళా పరిరక్షణకు, కళాకారుల సమగ్రాభివృద్ధికి గొప్ప సంకల్పమని వ్యాఖ్య
-కొండపల్లి కొండల గాలి తాకి..
-కళగా మారిన పొణికి ముక్క..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హస్తకళాకారుని చేతిలో జీవం పోసుకొని రంగుల పూదోటలో విహరించిన మన అందాల బొమ్మ దేశం దాటి ప్రపంచం చూసి పులకించాలనే లక్ష్యంతో మన గర్వం మరింత ఎత్తుకు చేరాలనే ఆకాంక్షతో రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వద్ద కొండపల్లి బొమ్మల పండగ వైభవంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్.. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు.. స్థానిక నేతలు, అధికారులతో కలిసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎక్కడాలేని విధంగా ఏర్పాటు చేసిన కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్‌సెంటర్‌తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలుబొమ్మల స్టాళ్లను సందర్శించి.. కళాకారులతో మాట కలిపి ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మన ఘనమైన 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో ఇది మొదలు ఈ పండగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామన్నారు. మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడి, కళను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో, ఐక్యంగా కళాకారుల సంక్షేమానికి బాటలు వేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న 200-300 మంది కళాకారులతో మెగా కార్నివాల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
పది మందికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు ప్రోత్సాహం: శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్*
కొండపల్లి బొమ్మల కళాకారులకు, కళాభిమానులకు ప్రపంచ వారసత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. కొండపల్లి ఖిల్లా.. మన చారిత్రక ఔన్నత్యానికి, శౌర్యానికి ప్రతీక అని, అదేవిధంగా కొండపల్లి బొమ్మ సంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ రెండింటినీ కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి, కళాప్రియుల అభిరుచులకు తగిన విధంగా కళను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని, వినూత్నంగా బొమ్మల డిజైన్లు రూపొందించిన కళాకారుల్లో టాప్-10 మందిని ఎంపికచేసి వచ్చే ఏడాది ఉత్సవాల్లో ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు. కొండపల్లి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధికి కృషిచేస్తున్నామని, త్వరలో లేజర్ షో ప్రారంభమవుతుందని, అదేవిధంగా నడకదారితో పాటు ప్రత్యామ్నాయ రహదారి అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలను కూడా తీసుకొని అభివృద్ధికి కృషిచేయనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి బొమ్మల పండగ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొండపల్లి బొమ్మల కళాకారులకు గౌరవం కల్పించి, వారు అన్నివిధాలా అభివృద్ధి పథంలో పయనించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగస్వాములవుతున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమాల్లో జెడ్‌పీ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు తదితరులు పాల్గొని కళలు, కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి పర్యాటక రంగ అభివృద్ధికి తద్వారా ఉపాధి సృష్టికి తీసుకుంటున్న చర్యలను తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు రామ్మోహనరావు (గాంధీ), కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ఛైర్మన్ సూర్యప్రకాశ్, సొసైటీ ప్రతినిధులు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, రీజనల్ డైరెక్టర్ వైవీ ప్రసన్న, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News