– కొండపల్లి బొమ్మల కళకు వన్నె తెచ్చేలా ఉత్సవాలు
– కళాకారుల సంక్షేమానికి సమష్టిగా పెద్దపీట
– ఏటా అంబరాన్ని తాకేలా మూడు రోజుల పాటు ఉత్సవాలు
– కొండపల్లి ఖిల్లా అభివృద్ధికీ ప్రభుత్వం ప్రత్యేక కృషి
– విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
– 250 మంది కళాకారుల ప్రదర్శనతో ఆకట్టుకున్న కొండపల్లి కార్నివాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
400 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మ కళకు కీర్తి.. కళాకారులకు కొత్త ఊపిరినిచ్చేలా కొండపల్లి బొమ్మల పండగను నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
కొండపల్లి బొమ్మల ప్రాచీన కళకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో కొండపల్లిలో జరుగుతున్న కొండపల్లి బొమ్మల పండగ రెండో రోజు ఆదివారం సాయంత్రం నిర్వహించిన మెగా హెరిటేజ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది కళాకారులు, కొండపల్లి బొమ్మల హస్తకళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. డప్పు, పులి వేషాలు, తప్పెటగుళ్లు, థింసా, గరగలు, కీలు గుర్రాలు.. ఇలా 12 రకాల సంప్రదాయ కళల కళాకారుల ప్రదర్శనలు అబ్బుపరిచాయి.
ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం కళా సాంస్కృతిక సంబరమై వాహ్ అనిపించింది.
*ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కొండపల్లి అందమైన ప్రాంతం.. కొండపల్లి బొమ్మ మరింత అందమైన సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని.. ఈ కళను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాజధానికి ముఖద్వారంగా ఉన్న ప్రాంతంలోని కొండపల్లి ఖిల్లాను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని.. గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో త్వరలో ప్రత్యేక కార్యాచరణతో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కొండపల్లి బొమ్మ మన ఆత్మ గౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
కొండపల్లి బొమ్మ అలనాటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు ప్రతీక అని.. రాచరికం పోయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ బొమ్మ వైభవం వర్ధిల్లుతోందని, ఈ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఈ పండగను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే ఖిల్లాపై లేజర్ షో ప్రారంభయ్యేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మను, కొండపల్లి ఖిల్లాను రెండింటినీ కాపాడుకోవాలనే గొప్ప సంకల్పంతో కళాకారుల సమగ్రాభివృద్ది లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు.
గ్లోబల్ హెరిటేజ్ బ్రాండ్‌గా కొండపల్లి బొమ్మ: రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి
కొండపల్లి బొమ్మను లోకల్ బ్రాండ్ నుంచి గ్లోబల్ హెరిటేజ్ బ్రాండ్ స్థాయికి తీసుకెళ్లేందుకు గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా చేస్తున్న కృషిలో భాగంగా ఈ పండగను నిర్వహించడం జరుగుతోందని.. ఈ బృహత్తర కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించనున్నట్లు రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఎక్కడా లేని విధంగా కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గౌరవ ఎంపీ, గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఈ ప్రాంతంతో పాటు కొండపల్లి బొమ్మ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తేజస్వి పేర్కొన్నారు.
కార్నివాల్లో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, స్థానిక నాయకులు సీతారామయ్య, రామ్మోహనరావు (గాంధీ), రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ ఛైర్మన్ సూర్యప్రకాశ్, సొసైటీ ప్రతినిధులు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News