-సిఎం సహాయ నిధి నుంచి రూ.56 కోట్ల విడుదలకు సంతకం
-22 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,298 కోట్ల ఆర్ధిక సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ మంచి సందర్భం వచ్చినా పేదలకు మేలు చేసే కార్యక్రమంతో ఆ రోజును ప్రారంభించడం ఆనవాయితీ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగాది రోజు, న్యూఇయర్ వంటి సందర్భాల్లో పేదలకు మేలు చేసే సిఎంఆర్ఎఫ్ ఫైలుపై తొలి సంతకం చేసి రోజు వారీ విధులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఇదే ఆనవాయితీని కొనసాగించారు. ఉండవల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో వేద ఆశీర్వచనం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నక్యాంటీన్ కు వెళ్లారు. అక్కడ లబ్దిదారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొంది సిఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి రూ.56.39 కోట్లు విడుదల చేసే దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. తన పుట్టిన రోజున పేదలతో కలసి అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన సిఎం… తరువాత పేదలకు లబ్ది చేకూర్చే ముఖ్యమంత్రి సహాయనిధి విడుదల ఫైలుపై సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 22 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో సిఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించలేదు. ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక కష్టాలు అవరోధం కాకూడదనే ఆలోచనతో అనేక సవాళ్లు ఉన్నా… పెద్ద మనుసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సాయం చేస్తున్నారు.
Prajavartha Online Telugu News