-అన్నదమ్ముల్లా కలిసుందాం… ఏపీ-తమిళనాడును అభివృద్ధి చేసుకుందాం
-థలి బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు
-థలి నుంచి తిరుపతికి బస్ వేస్తామని సీఎం హామీ
-ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ కు ఓటేయాలని కోరిన ముఖ్యమంత్రి
తమిళనాడు/కృష్ణగిరి/థలి, నేటి పత్రిక ప్రజావార్త :
డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ డెవలప్మెంట్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా థలి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్‌కు మద్దతుగా ఓట్లేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్డీఏ నేతలు థలి నుంచి తిరుపతికి బస్సు సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు…దీనికి సీఎం అంగీకారించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానం తమిళనాడులోనూ కనిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమిళనాడుకు వచ్చినా తన సొంత గడ్డపై ఉన్న భావన కలుగుతుందని అన్నారు. తమిళ సంస్కృతిపై ఎన్నో దాడులు జరిగినప్పటికీ ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకున్న గొప్ప నేల తమిళనాడని కొనియాడారు. అనేక ప్రముఖులు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పారు. తిరుపతికి తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, భాష వేరైనా మనమంతా ద్రవిడులమనే భావనతో కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. నందమూరి తారక రామారావు సినీ జీవితం తమిళనాడులోనే ప్రారంభమైందని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే చెన్నైకి తెలుగు గంగ నీళ్లు అందించిన ఘనత కూడా ఎన్టీఆర్‌దేనని తెలిపారు. తాను తమిళనాడు-ఏపీ సరిహద్దులోని చిత్తూరు నుంచి వచ్చినవాడినని, ఈ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి పరస్పరం సహకరించుకుని అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు.
దేశానికి దిక్సూచిగా ప్రధాని మోదీ
దేశానికి సమర్థ నాయకత్వం అందిస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీనేనని కొనియాడిన చంద్రబాబు, సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో దేశ భవిష్యత్తును ప్రధాని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన నాయకుడు మోదీ అని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును తీసుకువచ్చిందని, అయితే ఆ బిల్లును కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయని ఏపీ సీఎం విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంపై కాంగ్రెస్, డీఎంకేలకు వచ్చిన అభ్యంతరమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదని గుర్తుచేశారు. క్రెడిట్ అవసరం లేదని, ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తామని ప్రధాని చెప్పిన తర్వాత కూడా బిల్లును అడ్డుకున్నారని చంద్రబాబు విమర్శించారు. నియోజకవర్గాల సంఖ్య 50 శాతం పెరుగుతుందని స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
ఎన్డీఏ గెలుపు… అభివృద్ధికి మలుపు
తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని, ఎన్డీఏ ప్రభుత్వం గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఏపీ సీఎం అన్నారు. ఏపీలో గత పాలకులు విధ్వంసం సృష్టిస్తే… తాము కేవలం 22 నెలల్లోనే రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తీసుకువెళ్లేలా నదుల అనుసంధానం చేపడతామని, గంగా-కావేరి కలయిక లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనికి కేంద్రంలో మోదీ నాయకత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగనివ్వనని, ఈ ప్రాంత అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తమిళనాడు కొన్ని అంశాల్లో వెనుకబడిందని, దీనికి కారణం ఎవరో ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి అన్నారు.
డీఎంకే పాలనలో తిరోగమనం
బసవ జయంతి వంటి పవిత్రమైన రోజున ఈ ప్రాంతానికి రావడం తన అదృష్టమని సీఎం చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో అప్పుల భారం పెరిగిందని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, డ్రగ్స్ సమస్య, మహిళలపై దాడులు, కస్టోడియల్ మరణాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం ధరలు పెంచి డీఎంకే ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోందని విమర్శించారు. అభివృద్ధి, ఉద్యోగాల కోసం కేంద్ర సహకారం కీలకమని, మాజీ సీఎం జయలలిత స్పూర్తితో రాష్ట్ర అభివృద్ధి జరగాలని సూచించారు. ఎన్డీఏకు వేసే ప్రతి ఓటు తమిళనాడు అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి గెలిచే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో స్థానిక ఎన్డీఏ పక్ష నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News