– ఎంఎంస్ఎంఈల బలోపేతంపై ప్రభుత్వ చర్యలు వివరించిన మంత్రి కొండపల్లి
– ఏపీలో ర్యాంప్ అమలుపై ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల హర్షం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ర్యాంప్ (Raising and Accelerating MSME Performance) కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరు గురువారం మంగళగిరిలోని ఏపీ ఎంస్ఎంఈ డవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏపీ ఎంఎస్ఎంఈ (MSME), సెర్ప్ (SERP), ఎన్ఆర్ఐ (NRI) సంబంధాల మరియు సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ మిస్టర్ విశ్వ మనోహరన్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలను వివరించారు. ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో ఫార్మలైజేషన్ (క్రమబద్ధీకరణ), మార్కెట్ లింకేజీలు, డిజిటల్ గవర్నెన్స్ గురించి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైజ్’ (OFOE) ప్రోగ్రామ్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయుటకు కావల్సిన చర్యలను తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 19 ఎంఎస్ఎంఈ పార్కులు అందుబాటులోకి రాగా… మరో 82 పార్క్‌లు నిర్మాణ దశల్లో ఉన్నాయని… ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. వివిధ అవగాహనా కార్యక్రమాలతో పాటు ఎంటర్ప్రైజ్ పోటీతత్వాన్ని మెరుగుపరిచే చర్యల ద్వారా ర్యాంప్ అమలులో రాష్ట్రం పురోగతిని ప్రతినిధుల బృందానికి మంత్రి వివరించారు. ప్రపంచ బ్యాంక్ బృందం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఫలితాల ఆధారిత విధానాన్ని (Outcome-oriented approach) మెచ్చుకుంది. ర్యాంప్ కింద సాధించిన పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఈ కార్యక్రమాల అమలులో ఏపీ అగ్రగామిగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ర్యాంప్ (RAMP) భారత ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అంకిత పాండే, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆదర్శ్ కుమార్, హర్ష్ ఝంజారియా, భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు డాక్టర్ మిలన్ శర్మ, డాక్టర్ అతుల్ ఇనామ్దార్, ఎంఎస్ఎంఈ నుంచి డాక్టర్ శంకర్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News