అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశుసంవర్ధక శాఖ అందిస్తున్న వైద్య సేవలను పశుపోషకులు ఉపయోగించుకొని, తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పశువైద్యల సూచనలు, సలహాలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు రైతులను కోరారు. వ్యవసాయంలో పశుపోషణ కీలకమైన పాత్ర పోషిస్తోందని రైతులకు వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగం పశుపోషణ ద్వారా వస్తుందన్నారు. అందుకు పశువైద్యులు అందిస్తున్న కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, పశుసంవర్థకశాఖల ఆధ్వర్యంలో నేడు (25.04.2026) శనివారం ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, కవులూరు గ్రామంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత పశువైద్య శిబిరాన్ని డైరెక్టర్ దామోదర్ నాయుడు ప్రారంభించారు. పాడిపశువులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సూది మందులు, ఫీడ్ సప్లమెంటరీ, వ్యాక్సిలను అందిస్తుందని వీటిని ఉపయోగించుకోవాలని తెలియజేశారు.అనంతరం పశువైద్యుల అభినందన సభ జరిగింది.ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ అధ్యక్షత వహించారు. దామోదర్ నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పట్టణాల నుంచి గ్రామాల వరకు గతంలో ఇంటికి వచ్చిన వారికి మజ్జిగ ఇచ్చే వారిని, ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తున్నారని వీటివల్ల ప్రజలు అనేక రోగాలపాలవుతున్నారన్నారన్నారు. ఆరోగ్యమైన సమాజం తయారు కావాలంటే సహజసిద్ధమైన పాలు, మాంసం, గుడ్లు అవసరమని, వాటి ఉత్పత్తి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. రసాయనాలతో కూడిన ఎరువులు, పురుగు మందులు వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని,సహజసిద్ధమైన పశువుల ఎరువులను వాడటం ద్వారా నాణ్యమైన పంట ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది పశువుల సంరక్షణ కోసం పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పశు వైద్యులు అందిస్తున్న సేవల ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. అన్ని రకాల వ్యాక్షన్లు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ మాట్లాడుతూ పశుసంపదను పెంచడంలోనూ, వాటి సంరక్షణలో పశువైద్యులు చేస్తున్న కృషిని అభినందించారు. పశు పోషణ ఈరోజు పేదవాళ్ళకి జోనోపాధిగా ఉందని వాటి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి పొందడానికి ఉన్న అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకోవాలని రైతులను కోరారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 4 వారంలో వచ్చే శనివారాన్ని ప్రపంచ పశు వైద్యదినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. పశువైద్య దినోత్సవం సందర్భంగా రైతులోకం పత్రిక స్పెషల్ తీసుకొచ్చామని ,అందులో పశు వైద్య నిపుణులతో కూడిన అనేక వ్యాసాలు ప్రచురించామని వీటిని అధ్యయనం చేయటానికి ఉపయోగించుకోవాలని కోరారు. గ్రామీణ సమాజానికి పాడి, పంట రెండు కళ్ళు లాంటివన్నారు. పశువైద్యశాఖ చేపడుతున్న పలు పథకాలను ఉపయోగించుకుని రైతులు లాభదాయకంగా పశుపోషను మలుచుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ నోరులేని మూగ జీవాలకు వైద్యం అందించి వాటికి రక్షణకు కృషి చేస్తున్న పశువైద్యల సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహించాలని పశువైద్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి అభినందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో పశుసంపద అభివృద్ధికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి అన్ని గ్రామాల్లో పశువైద్యశాలలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న పశు వైద్యుల పోస్టులను భర్తీ చేయడం ద్వారా పశువైద్యాన్ని మరింత మెరుగుపరిచి అందుబాటులో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మాధవరావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, మైలవరం అసిస్టెంట్ డైరెక్టర్ హరి హరనాథ్, విజయడైరీ మేనేజర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు డాక్టర్ సునంద, డాక్టర్ శ్రీకాంత్‌లతోపాటు పలు గ్రామాల పశు వైద్యులు, పాలసొసైటీ అధ్యక్షులు బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు అక్కినేని సత్యనారాయణ, గరిమెళ్ళ పూర్ణచంద్రరావు మరియు స్థానిక రైతు నాయకులు బుడ్డిరమేష్, తాటికొండ రమేష్ ,చిలుకూరి శ్రీనివాసరావు, చిలుకూరి వెంకట్రావు, గరిమెళ్ళ సాంబశివరావు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశు వైద్యులకు, పాల సోసైటీ ప్రెసిడెంట్లకు సాలువాలు కప్పి సత్కరించారు.
Prajavartha Online Telugu News