– వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి విజయవాడలోని ఎస్ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో శనివారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మొబైల్ రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు నేరుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి వినియోదారులకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని, దీనిద్వారా ప్రకృతి వ్యవసాయ రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు వినియోగదారులకు కూడా ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరినీ ఈ విధంగా మ్యాప్ చేసి భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి మొబైల్ వెహికల్స్ ప్రారంభించి ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగ దారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు.
జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయ రైతులందరకీ వారు పండించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ట్రేసబులిటీ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వినియోగదారులు తాము కొంటున్న వస్తువులను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆ ప్రకృతి వ్యవసాయ రైతు వివరాలు కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో కూడా మార్కెటింగ్ అవకాశాలు రైతులకు కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఇన్చార్జ్ వి .నాగప్రమీల రాణి, ప్రకృతి వ్యవసాయ రైతులు,అధికారులు, వినియోగ దారులు, స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News