– 100 రోజుల కార్యాచరణ పటిష్ట అమలుకు చర్యలు
– విస్తృత ప్రజాభాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతానికి కృషి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నీటి భద్రత సాధనకు జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గౌరవ సీఎం దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో శనివారం ఆయన తెలిపారు.
జిల్లాలో 439 చెరువులున్నాయని.. ఇవన్నీ నిండితే 10 టీఎంసీల నీటిని పట్టి ఉంచవచ్చని.. అయితే ప్రస్తుతం వీటి సామర్థ్యం 6.4 టీఎంసీలుగా ఉందని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు జలధార కింద వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఫీడర్ ఛానళ్లు, చెరువుల్లో పూడిక తీతతో పాటు వివిధ పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. స్లూయిస్ మరమ్మతులు, ఫీడర్ ఛానళ్ల అభివృద్ది వంటివాటిపైనా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసేందుకు రీచార్జ్ పిట్స్, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం, పాత జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, వ్యవసాయ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చినట్లు వివరించారు. నీటి సంరక్షణలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని వృథా కాకుండా వినూత్న విధానాలను ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా జిల్లాలో నీటి భద్రతకు, నీటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్ తరాలకు స్థిరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు: జిల్లాలో వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, నీటి సమస్యలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిష్కారానికి ప్రత్యేక మొబైల్ బృందాలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మనుషులు, పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, పీ4 కింద మంచి మనసున్న వారు కూడా చలివేంద్రాల ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు కూడా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బంది ఉంటే 91549 70454 కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News