– ప్రమాణాల్లో చిన్న నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవు
– ప్రమాదాలు జరక్కుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ ప్లానుకు ఆమోదం
– జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక అభివృద్ధి ఎంత వేగంగా సాగుతున్నా, భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ ఉండకూడదని.. పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా భావించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి సంస్థ పటిష్ట భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ (డీసీజీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్సైట్, ఆఫ్‌సైట్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని.. లోటుపాట్లు ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. రసాయన విపత్తులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నెల 30న జి.కొండూరు మండలం, కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్నినల్‌లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీల్లో గ్యాస్ లీకేజ్, అగ్ని ప్రమాదాలు వంటివి జరక్కుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రతినెలా లెవెల్-1 మాక్‌డ్రిల్స్, ఆర్నెల్లకోసారి లెవెల్-2 మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. క్రమంతప్పకుండా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్ నివేదికలు పంపాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చోళమండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సంస్థ రూపొందించిన ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఆమోదం పొందినందున దీని అమలుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. రసాయన, అగ్ని, యాంత్రిక ప్రమాదాల వంటి విభిన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్లులు, శిక్షణా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని.. అత్యవసర సమయాల్లో స్పందించే విధానంపై కార్మికులకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు. భద్రతా పరికరాల వినియోగం, యంత్రాల నిర్వహణలో నిబంధనలు పాటించడం, ప్రమాద సూచికల అమలు వంటి అంశాలలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని.. పరిశ్రమల యాజమాన్యాలు తమ బాధ్యతను గమనించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలుచేయాలన్నారు. పారిశ్రామిక ప్రగతికి తోడు భద్రతా సంస్కృతి పెంపొందితేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సమావేశంలో కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ రాజు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, వివిధ పారిశ్రామిక సంస్థలు, కర్మాగారాల ప్రతినిధులు, భద్రతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News