-జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, పెట్రోల్, డీజిల్ నిల్వలు ప్రజలకు సరిపడా ఉన్నాయనీ జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలో డీజల్, పెట్రోల్ లభ్యత పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ…తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 185 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో బిపిసిఎల్ – 48, హెచ్పిసిఎల్ – 50, ఐఓసిఎల్ – 68, నయారా – 14, రిలయన్స్ – 5 ఉన్నాయి. ఈరోజు ఉదయం అందిన నివేదిక ప్రకారం జిల్లాలో పెట్రోల్ (మోటార్ స్పిరిట్) 1294 కిలోలీటర్లు, డీజిల్ (హెచ్ఎస్డి) 2102 కిలోలీటర్లు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న సమస్యలు నిజమైన కొరత వల్ల కాకుండా, సోషల్ మీడియాలో వచ్చిన అపోహల కారణంగా ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడినట్లు వెల్లడించారు.
ఐఓసిఎల్‌కు చెందిన 6 పెట్రోల్ బంకులు మరియు హెచ్పిసిఎల్‌కు చెందిన 2 బంకుల్లో తాత్కాలికంగా డ్రై పరిస్థితి ఏర్పడినప్పటికీ, ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి రేపు ఉదయం 11 గంటలలోపు పూర్తిగా సరఫరా పునరుద్ధరించబడుతుందని తెలిపారు.
ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ శాఖ నుంచి విఆర్ఓలు, పోలీస్ శాఖ నుంచి సిబ్బందిని నియమించడం జరిగిందనీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ రోజు తాను స్వయంగా ఫీల్డ్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల ట్యాంకర్ సరఫరా సమయంలో తాత్కాలికంగా మూసివేసిన బంకులను వెంటనే తెరిపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పానిక్‌కు గురి కాకుండా, బాటిల్స్ లేదా టిన్నులతో ఇంధనం నిల్వ చేసుకునే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సాధారణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచించారు. అపోహలు, తప్పుడు వార్తలను నమ్మవద్దని తెలిపారు. జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని, అన్ని ప్రధాన పెట్రోల్ బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధులు నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసి అపోహలను నివారించడంలో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News