Breaking News

అసాధారణ పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన ప్రత్యేక ప్రతిభావంతులు

-అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు
-విజయవంతంగా 21 మంది దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ శిఖరారోహణ!
-దివ్యాంగుల బృందంతో ట్రెక్కింగ్.. ప్రపంచంలోనే తొలిసారి
-వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
-అభినందించిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్
-హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు

-“సరిగ్గా నడవలేడు, వినపడదు.. ఈ అబ్బాయి కొండలు ఎక్కుతాడా?” లేదా “ఇంత కష్టమైన పని నీకెందుకు, ఇంట్లో కూర్చోవచ్చు కదా” వెటకారపు మాటలు..
– ” దినసరి కూలీల బిడ్డలు.. తిండికే కష్టమైన పరిస్థితుల్లో మీకు ఈ సాహసయాత్రలు ఎందుకు?” అనే ప్రశ్నలు.
-“పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కానిది, ఈ పేద పిల్లలు ఏం చేస్తారు?” అనే చిన్నచూపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇవన్నీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన 21 మంది దివ్యాంగ చిన్నారులకు సమాజం నుండి ఎదురైన చేదు అనుభవాలు, అవమానాలు, వెటకారాలు. కానీ వారిలో ఉన్న కసి ‘ఎవరెస్ట్’ కంటే ఎత్తయినది. ఆ శిఖరాగ్రాన వారు ఎగిరేసిన విజయ పతాకమే తమను తక్కువ చేసిన మాటలకు ఇచ్చిన గట్టి సమాధానం. ఈ రోజు వారు బేస్ క్యాంప్ మీద నిలబడి చూస్తుంటే, ఆ అవమానాలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఆ అవమానాలే వారికి ఇంధనాలు అయ్యాయి. ఆ అవమానాలే లేకపోతే, ఇంతటి గొప్ప విజయం సాధించాలనే పట్టుదల వారిలో ఉండేది కాదేమో!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు (CwSN), నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై విజయకేతనం ఎగురవేసి, ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పారు.
దేశంలో తొలిసారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ప్రత్యేక ప్రతిభావంతులకు ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారిగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 21 మంది విద్యార్థుల బృందం ఏప్రిల్ 15న నేపాల్ రాజధాని ఖాట్మండూకు చేరుకున్నారు. ఏప్రిల్ 15 నుండి 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేసింది.. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించారు. వీరిలో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. వీరితో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ పర్వతారోహకులు షేక్ హిమాన్షు, మలావత్ పూర్ణ, సమగ్ర శిక్ష స్పోర్ట్స్ విభాగం నుండి కె.శంకరయ్య పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సాహస యాత్రను వారి క్యాంప్ ఆఫీసు నుండి స్వయంగా ప్రారంభించి, విద్యార్థులలో స్థైర్యాన్ని నింపారు. “మీలో ఉన్న పట్టుదలే మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది” అని ఆయన ఇచ్చిన పిలుపు విద్యార్థులకు కొండంత అండగా నిలిచింది.
అండగా నిలిచిన సమగ్రశిక్ష
సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS., పర్యవేక్షణలో ఈ విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో, లద్దాఖ్‌లో కఠినమైన శిక్షణ అందించారు. ప్రభుత్వం తరఫున ఈ యాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు.
కఠిన శిక్షణ.. అలుపెరుగని పట్టుదల
ఈ విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో తొలి అడుగులు నేర్పారు. అక్కడి నుంచి లద్దాఖ్‌లోని మైనస్ 5 డిగ్రీల గడ్డకట్టే చలిలో విద్యార్థులు కఠిన శిక్షణ పొందారు. గండికోటలో 45 రోజులు, లద్దాఖ్ లో 15 రోజులు శిక్షణలో కొండలను అధిరోహించడంలో వేగాన్ని పెంచుకున్నారు.
ఈ విజయం కేవలం ఆ 21 మంది విద్యార్థులది మాత్రమే కాదు, సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప స్ఫూర్తి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సరైన వేదిక కల్పిస్తే వారు ఆకాశమే హద్దుగా రాణిస్తారని ఈ ‘నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర’ నిరూపించింది.
రేపటి తరానికి మీరు ‘రోల్ మోడల్స్’
ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు (CwSN) నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించడం నాకు గర్వకారణంగా ఉంది. సాధారణంగా వైకల్యాన్ని అడ్డంకిగా భావించే లోకానికి, మీ ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సమాధానం. 5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో ఉండే ఆ మంచు శిఖరాలను మీరు అధిరోహించడం అంటే కేవలం ఒక కొండను ఎక్కడం మాత్రమే కాదు, మీపై ఉన్న అపనమ్మకాలను, అవమానాలను అధిగమించి శిఖర సమానమైన ఎత్తుకు ఎదగడం. ప్రతి ఏటా ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. మీ వెనుక ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి తరానికి మీరు ‘రోల్ మోడల్స్’. మీరందరూ సురక్షితంగా, విజయవంతంగా సాహసయాత్రను పూర్తి చేసి వస్తున్నందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

– నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి

తల్లిదండ్రుల హర్షం
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విజయం చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపిందని, వారిలో సొంతంగా బతకగలమనే ధైర్యాన్ని నింపిందని వారు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల బృందం
1. కాలగట్ల శివ లక్ష్మి (9వ తరగతి, వినికిడి లోపం, కర్నూలు)
2. ఎస్.డి. రిహానా (9వ తరగతి, వినికిడి లోపం, కర్నూలు)
3. బోడిరెడ్డి సింధు (ఇంటర్ 2వ సంవత్సరం, వినికిడి లోపం, తిరుపతి)
4. నీలకంటి మధు తనూజ (9వ తరగతి, వినికిడి లోపం, నంద్యాల)
5. దూదేకుల అభిధ యశ్విన్ (9వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)
6. బండి స్వాతి (9వ తరగతి, దృష్టి లోపం, నంద్యాల)
7. ఎర్రమాల కీర్తన (8వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)
8. పితాని రూప సాయి శ్రీ (9వ తరగతి, వినికిడి లోపం, కాకినాడ)
9. చల్లా పవన్ కుమార్ (10వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, అనకాపల్లి)
10. లెక్కల హరి శ్రీ దుర్గా ప్రసాద్ (10వ తరగతి, వినికిడి లోపం, విశాఖపట్నం)
11. పాసల ప్రసాద్ (10వ తరగతి, మేధో వైకల్యం, శ్రీ సత్యసాయి జిల్లా)
12. పత్తికొండ పునీత్ సాయి (10వ తరగతి, వినికిడి లోపం, తిరుపతి)
13. వెలుగు జ్ఞాన సాయి (9వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, శ్రీకాకుళం)
14. యర్లబోయిన వెంకీ (10వ తరగతి, వినికిడి లోపం, వైఎస్ఆర్ కడప)
15. బుడిద మణికంఠ (ఇంటర్ 1వ సంవత్సరం, లోకోమోటర్ వైకల్యం, శ్రీకాకుళం)
16. అంబటి తెలుగు దేవేంద్ర (10వ తరగతి, వినికిడి లోపం, నంద్యాల)
17. తలారి మధు మనోజ్ (10వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)
18. దూదేకుల మౌలాలి (10వ తరగతి, లోకోమోటర్ వైకల్యం, నంద్యాల)
19. గట్టెం విశ్వాస్ (10వ తరగతి, దృష్టి లోపం, విజయవాడ)
20. బెల్లపు దిలీప్ కుమార్ (ఇంటర్ 1వ సంవత్సరం, మేధో వైకల్యం, అన్నమయ్య జిల్లా)
21. అన్నంనేడి దైవ వెంకట సత్యనారాయణ (10వ తరగతి, వినికిడి లోపం, పశ్చిమ గోదావరి)

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *