Breaking News

ఆయిల్ బంకుల వద్ద సాధారణ స్థితికి డీజిల్ పెట్రోల్…

-ఆయిల్ కంపెనీ నుండి ఆదనంగా డీజిల్ పెట్రోల్ సరఫరా…
-డీజిల్ పెట్రోల్ సరఫరా పై వదంతులను నమ్మవద్దు…
-వదంతులను సృష్టించేవారిపై కఠిన చర్యలు…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ,
-సిపి ఎస్.వి రాజశేఖర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆయిల్ బంకులకు అవసరమైన డీజిల్ పెట్రోల్‌ను సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయని పెట్రోల్ డీజిల్‌కు కొరత ఉందని రేట్లు పెరిగే అవకాశం ఉందనే వదంతుల కారణంగా వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్‌ను కొనుగోళ్ళు చేస్తున్న కారణంగా బంకుల వద్ద ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడ్డాయని జిల్లా యంత్రంగం తీసుకున్న చర్యల కారణంగా బంకుల వద్ద రద్దీ దాదాపుగా తక్కుముఖం పట్టిందని వదంతులకు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబులు తెలిపారు.
పెట్రోల్ డీజిల్ సరఫరా పరిస్థితులపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని శ్రీ ఎవిఎస్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌హాల్ నందు జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ, పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియాలు మీడియా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 186 పెట్రోల్ బంకుల ద్వారా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుందన్నారు. కొండపల్లి ప్రాంతంలోని ఆయిల్ కంపెనీల నుండి మరో 10 జిల్లాలకు డీజిల్ పెట్రోల్ సరఫరా చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా ఇతర ప్రచార మాద్యమాల ద్వారా డిజిల్ కొరత ఉందనే అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు రోజు వారి కొనుగోళ్ళు చేసే డీజిల్ పెట్రోల్ అదనంగా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పాడాయన్నారు. జిల్లాలో ప్రతి రోజు బంకులకు ఆయిల్ కంపెనీల నుండి 3 లక్షల లీటర్ల పెట్రోల్ 5 లక్షల లీటర్లకు పైగా డీజిల్ సరఫరా చేయడం జరిగేదన్నారు. కొరత కారణంగా మరో 10 శాతం అదనంగా సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా పెట్రోల్ బంకుల వద్ద కొంత మేర రద్దీ తగ్గిందన్నారు. సరఫరా చేసిన డీజిల్ పెట్రోలు సజావుగా వినియోగదారులకు అందజేసేందుకు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులతో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక టీమ్ లు పెట్రోల్ బంకులను సందర్శిస్తూ, నిల్వలు, సరఫరా, వినియోగ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని వివరించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసి మోనిటరింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డీజిల్‌ పెట్రోల్ సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసిన్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఇంధన సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ఇందుకోసం కంట్రోల్ రూము ఏర్పాటు చేయడం జరిగిందని వినియోగదారులకు ఇబ్బంది తలెత్తిన పక్షంలో 91549 70454 నందు సంప్రదించవచ్చని సూచించారు. మరో ఒకటి రెండు రోజులలో డీజిల్ పెట్రోల్ అమ్మకాలు సాధారణ స్థితికి చేరుతాయని జిల్లాకలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు.

నగరపోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీల నుండి పెట్రోల్ బంకులకు అవసరమైన డీజిల్ పెట్రోల్ సరఫరా చేసేందుకు అవసరమైన నిల్వలు సిద్దంగా ఉన్నాయాన్నారు. వదంతుల కారణంగా ఆందోళన ఏర్పడి సాధారణ కొనుగోళు కంటే అదనంగా కొనుగోలు చేయడం జరిగిందని దీనితోపాటు తిరిగే అవసరం లేకపోయిన ఆయిల్ దొరకదేమోనని క్యూ లో ఉండి సైతం ఆయిల్ పోయించుకోవడానికి ముందుకు రావడంతో బంకుల వద్ద వాహనాల క్యూ పెరగిపోవడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేశామని సోషల్ మీడియాలో వదంతుల ప్రచారం చేసేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ సరఫరా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. వ్యవసాయం, ఆక్వా రంగం, ఆస్పత్రులు మరియు అంబులెన్స్ అవసరాలను ప్రధాన ప్రాధాన్యతగా గుర్తించి డీజిల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కమర్షియల్ డీజిల్ వినియోగదారులు కూడా రిటైల్ బంకుల వైపు రావడం వల్ల కొంతమేర డిమాండ్ పెరిగిందని చెప్పారు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో కొంతమేర అధిక ధరలు వసూలు చేస్తున్న అంశాన్ని గమనించామని, దీనిపై సంబంధిత అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బంకు యజమానులు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తున్నారని, ఆయిల్ కంపెనీలు కూడా అదనపు సరఫరా అందిస్తున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో సరఫరా సమృద్ధిగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *