-మంత్రి లోకేష్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలు… హోం మంత్రి అనిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంత్రి లోకేష్ అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం 81.14% నుంచి 85.25%కి పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 78.39% ఉత్తీర్ణత నమోదవడం ఆయన దూరదృష్టి, పక్కా ప్రణాళికకు నిదర్శనమని అన్నారు. ఈ ఫలితాల్లో బాలికలు 87.90% ఉత్తీర్ణతతో ముందంజలో నిలవడం శుభపరిణామమని మంత్రి అనిత పేర్కొన్నారు. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం, విజయనగరం జిల్లా మూడో స్థానం, అనకాపల్లి జిల్లా ఆరో స్థానం సాధించడం ఆనందకరమని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన ఈ గుణాత్మక మార్పుకు మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు తెలిపారు. అలాగే పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా, మరింత కృషి చేసి మళ్లీ ప్రయత్నించి విజయాన్ని సాధించాలని మంత్రి అనిత సూచించారు.
Prajavartha Online Telugu News