– ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల సాధికారతకు పారిశ్రామిక రంగం కీలక వేదిక అని.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని.. మంచి ఆలోచనతో ఆత్మవిశ్వాసమే మూలధనంగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శనివారం గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో భారతీయ యువశక్తి ట్రస్ట్ భాగస్వామ్యంతో పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం (ఈడీపీ) జరిగింది. దాదాపు 70 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ట్రస్ట్ ప్రతినిధులు.. పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకునే వారికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం అందించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళల్లో నైపుణ్యాలు, సృజనాత్మకతను ఉపయోగించుకుని చిన్న స్థాయి వ్యాపారాలను పెద్ద స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడటంతో పాటు, పారిశ్రామిక రంగంలో ముందంజ వేయవచ్చని వివరించారు. మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెడితే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించడం సాధ్యమని మహిళలకు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. భారతీయ యువశక్తి ట్రస్ట్.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతను ఉద్యోగ అన్వేషకులు నుండి ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడానికి విశేషంగా కృషిచేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, లావణ్యకుమారి సారథ్యంలోని భారతీయ యువశక్తి ట్రస్ట్ బృంద సభ్యులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News