– అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ లక్ష్మీశ
– భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచన
– విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రను ప్రశంసించిన కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, ఈ విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని అత్యుత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి సత్కరించారు. అధికారులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలుచేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గరిష్ఠంగా 595 మార్కులు రాగా.. 31 మంది విద్యార్థులు 580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారన్నారు. 376 మంది విద్యార్థులకు 550కు పైగా మార్కులు వచ్చాయని అదేవిధంగా 1,557 మంది విద్యార్థులు 500కు పైబడి మార్కులు సాధించారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యమైనా సాధించగలరని పేర్కొన్నారు. పదో తరగతి విజయాన్ని ఒక మొదటి మెట్టుగా భావించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సాధించేందుకు కృషిచేయాలని సూచించారు. విద్యార్థుల విజయాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని.. వారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలిగారని అభినందించారు. జిల్లా అభివృద్ధికి విద్యార్థులే చోదకశక్తులని పేర్కొంటూ, పోటీ ప్రపంచంలో ముందుండేందుకు లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించకుండా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, డిప్యూటీ డీఈవో సాంబశివరావు, సమగ్రశిక్ష ఏపీసీ రమేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ అలీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News