Breaking News

నీట్ పరీక్షకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా సౌక‌ర్యాల క‌ల్ప‌న‌
– పార‌ద‌ర్శ‌కంగా, నిష్ప‌క్ష‌పాతంగా విధులు నిర్వ‌ర్తించాలి
– అధికారులు, సిబ్బందికి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 3వ తేదీ ఆదివారం జ‌రిగే జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 నిర్వ‌హ‌ణ‌కు ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
శ‌నివారం న‌గ‌రంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ (ఎస్‌పీఏ) స‌మావేశ మందిరంలో నీట్‌-2026 తుది స‌న్న‌ద్ధ‌త‌, స‌మ‌న్వ‌య స‌మావేశం జ‌రిగింది. కోఆర్డినేట‌ర్లు, అబ్జ‌ర్వ‌ర్లు, ప‌రీక్ష కేంద్రాల సూప‌రింటెండెంట్లు, ఇన్విజిలేట‌ర్లు హాజ‌రైన ఈ స‌మావేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌తిష్టాత్మ‌క ప‌రీక్ష‌ను విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో మొత్తం 32 ప‌రీక్షా కేంద్రాల్లో దాదాపు 12 వేల మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతార‌ని.. మధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని అధికారులు వివ‌రించారు. అభ్య‌ర్థుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ధ్రువీక‌ర‌ణ‌, బయోమెట్రిక్ హాజరు, ఫ్రిస్కింగ్ ప్రక్రియలు ఒకే ప్రవేశ ద్వారం ద్వారా జ‌రుగుతాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌త‌మ విధుల‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న‌తో అప్ర‌మ‌త్త‌త‌తో ఉండాల‌న్నారు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో విద్యార్థులు ప‌రీక్ష రాసేలా చూడాల‌న్నారు. నిషేధిత వస్తువులపై గ‌ట్టి నిఘా ఉండాల‌ని, ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తి ప‌రీక్షా కేంద్రానికి సంబంధించి సీటింగ్‌, వీడియోగ్ర‌ఫీ, భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, వైద్య స‌దుపాయాలు, అగ్ని ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు, తాగునీరు త‌దిత‌ర ఏర్పాట్లు చేశామ‌న్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామ‌ని.. స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా, వైద్య శిబిరాలు వంటివి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. పరీక్షల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. నీట్ ప‌రీక్ష‌కు విద్యార్థులు తప్పనిసరిగా ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ ఫోటో ఐడీ వంటివి తీసుకెళ్లాలని.. పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాల‌ని.. గేట్లు నిర్ణీత సమయం తర్వాత మూసివేయడం జ‌రుగుతుంద‌ని ప‌రీక్ష స‌మ‌న్వ‌యక‌ర్త‌లు వివ‌రించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్ ను పాటించాల‌ని.. ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ వంటివి)ను నిషేధించ‌డం జ‌రిగింద‌న్నారు.
స‌మావేశంలో నీట్ సిటీ కోఆర్డినేట‌ర్లు డా. ఎం.గోపీకృష్ణ‌, ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *