-చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు
-ప్రతి జిల్లాకు చైర్మన్ల నియామకం
-ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటిపాటి జాన్ వెస్లీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ‘ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్’ మిషన్ కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటి పాటీ జాన్ వెస్లీ తెలిపారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో నిరుద్యోగ యువతకు ఈ మిషన్ ద్వారా నైపుణ్య శిక్షణ మరియు ఆర్థిక చేయూతనిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రతి గ్రామం, నియోజకవర్గం మరియు జిల్లా స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని విస్లీ వెల్లడించారు. ముఖ్యంగా ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి శిక్షణతో పాటు లోన్లు అందజేసి ప్రోత్సహిస్తామని వివరించారు. నిరుపేదలకు, వెనుకబడిన వర్గాల వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా అద్దంకి రంజిత్ తోరి బాధ్యతలు స్వీకరించారని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతి జిల్లాకు ఒక చైర్మన్‌ను కోర్ కమిటీని నియమిస్తామని తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులనే ఈ పదవులకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఈ మిషన్ అమలులో సహకారం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలోనే లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు మేలు జరుగుతుండటం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసింగ్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం. తారస్రవంతి, రాష్ట్రీయ ఉద్యోగ భారత్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ కుమార్ మడ్వా, తెలంగాణ చైర్మన్ అద్దంకి రంజిత్ ఓఫిర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News