-కేసుల ఛేదనలో సహకారం కీలక సహకారం అందిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ360
-అదృశ్యమైన ముగ్గురు మహిళల ఆచూకీ లభ్యం
-హత్య, దోపిడీ కేసులో నిందితుడిని పట్టించిన టెక్నాలజీ
-వాహన చోరీ కేసు చేధనలోకూ కీలక పాత్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ కేసుల దర్యాప్తులో పోలీసులకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తనదైన సాంకేతిక తోడ్పాటు అందిస్తూ కేసుల ఛేదనలో పోలీసులకు తగినంత సహకారం అందిస్తోంది. తాజాగా ఐదు కేసుల్లో ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ కీలకపాత్ర పోషించి ఈ కేసుల దర్యాప్తులో పోలీసుల పని సులభతరం చేసింది. అదృశ్యమైన ముగ్గురు మహిళల ఆచూకీ కనుగొనడంలో ఆర్టీజీఎస్ సీసీటీవీ360 కీలక పాత్రపోషించింది. ఈ ముగ్గురిలో ఇద్దరు బాలికలున్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో హత్య చేసి, ఇంట్లో సొత్తు దోపిడీ చేసి వెళ్లిన హంతకుడ్ని కూడా సకాలంలో పట్టించడంలో ఆర్టీజీఎస్కు చెందిన సర్వైలెన్సు కెమెరాలు కీలకంగా పనిచేశాయి. మోటారు సైకిల్ దొంగిలించి పరారైన మరో నిందితుడి కదలికలను సైతం పసిగట్టి నిందితుడ్ని పట్టించేలా చేయడంలో ఆర్టీజీఎస్ సాంకేతికత సమర్థవంతంగా పనిచేసింది. శాంతిభద్రత పరిరక్షణకే కాకుండా, పలు కేసుల దర్యాప్తులోనూ పోలీసులకు సహకరించేలా ఆర్టీజీఎస్లో సీసీటీవీ360 అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా తాగాజా ఐదు కేసుల్లో పోలీసులు ఆర్టీజీఎస్ సీటీటీవీ360 సాంకేతిక సహకారాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు.
1. కర్నూలు అదృశ్యమైన బాలిక…విజయవాడలో గుర్తింపు
కర్నూలు జిల్లాల నందవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 22న 17 సంవత్సరాల బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక ఆచూకీ కనుక్కోవడానికి ఆర్టీజీఎస్ సహకారాన్ని పోలీసులు కోరారు. ఆమె ఫొటోను ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్లో అప్లోడు చేసి టైమ్ సెన్సిటివ్ అప్రోచ్ ద్వారా డిజిటల్ గాలింపు చేపట్టారు. ఆమె విజయవాడకు వచ్చి నగరంలోని ఒక ప్రధాన కూడలిలో తచ్చాడుతున్నట్లు ఆర్టీజీఎస్ రియల్ టైమ్ అలర్టులను పోలీసులకు పంపింది. దీంతో నందవరం పోలీసులు విజయవాడ పోలీసుల సహకారంతో బాలికను పట్టుకుని ఆమె తల్లిదండ్రులకు అప్పగించగలిగారు.
2. నంద్యాలలో అదృశ్యమై.. ఒంగోలులో కనిపించిన బాలిక
నంద్యాల జిల్లా గడివేముల పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 25న 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వెళ్లిన మోటారు బైకు నంబరు ఆధారంగా ఆమె ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. ఆ బాలిక ఫొటో, ఆమె వెళ్లిన వాహనం నంబరును ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్లో అప్లోడు చేసి ఆమె కదలికలను గాలించారు. ఆమె ఏప్రిల్ 29న ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఒక ప్రధాన కూడలిలో ఉండగా సీసీటీవీ కెమెరాలు కనిపెట్టాయి. ఆర్టీజీఎస్ పోలీసులకు రియల్ టైమ్ అలర్టులు పంపడంతో నంద్యాల, ఒంగోలు పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ఆమెను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
3. చిత్తూరులో యువతి ఆచూకీ కొనుగొన్న సీసీటీవీలు
చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో ఈ నెల 24న 22 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు అక్కడి పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ అదృశ్యం వెనుక ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు ఈ కేసు ఛేదనకు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. ఆ యువకుడి వాహనం నంబరు, ఆ యువతి ఫొటోలను ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్లో అప్లోడు చేసి పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పీఓఐ), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీ అప్రోచ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. వారు వెళ్లిన వాహనం 28వ తేదీ వరకు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో తిరుగాడినట్లు గుర్తించి అటు నుంచి చిత్తూరుకు వెళుతున్నట్లు సీసీటీవీల ద్వారా గుర్తించారు. ఆ సమాచారాన్ని ఆర్టీజీఎస్ పోలీసులకు రియల్ టైమ్ అలర్టులు పంపడంతో పోలీసులు వారిని చిత్తూరు పట్టణంలో పట్టుకున్నారు.
4. హత్య, దోపిడీ కేసు ఛేదనలో సహకారం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 15న నమోదైన హత్య, దోపిడీ కేసుకు సంబంధించి నిందితుడ్ని పట్టుకోవడంలో ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ కీలకంగా పనిచేసింది. నిందితుడి ఆచూకీ కనుగొనడానికి పోలీసులు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఆర్టీజీఎస్కు చెందిన మ్యాట్రిక్స్ సర్వైలెన్సు కెమెరాల్లో నిందితుడి అనుమానిత కదలికలు రికార్డు అయ్యాయి. ఇది పోలీసులకు గోల్డెన్ లీడ్‌గా మారింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేయడంతో పాటు అతడి నుంచి బంగారు నగలు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇది డిజిటల్ ఎవిడెన్సుగా కూడా పోలీసులకు ఉపయోగపడనుంది.
5. మార్చిలో చోరీకి గురైన మోటారు సైకిల్ ఆచూకీ లభ్యం
ఏలూరు జిల్లా పోలవరం పోలీసు స్టేషన్ పరిధిలో గత మార్చిలో చోరీకి గురైన మోటారు సైకిల్‌ను కూడా పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 సహకారంలో విజయవంతంగా పట్టుకోగలిగారు. చోరీకి గురైన మోటారు సైకిలు నంబరు ఆధారంగా ఆర్టీజీఎస్ జనరల్ సర్వైలెన్స్ మ్యాట్రిక్స్ ద్వారా హై రిజల్యూషన్ ఇమేజెస్ ద్వారా ఆ వాహనం కదలికలను పసిగట్టారు. గోదావరి జిల్లా కడియం పోలీసు స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్లు పోలీసులకు ఆర్టీజీఎస్ అలర్టులు పంపడంతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ఈ బైకును చోరీ చేసిన నిందితుడ్ని పట్టుకుని బైకును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల మధ్య మరింత సమన్వయం
ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీల సాంకేతిక వ్యవస్థ పోలీసుల మధ్య సమన్వయం పెంపొందించడానికి దోహదపడుతోంది.
కేసు దర్యాప్తులో పోలీసుల మధ్య జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపివేస్తూ, నేరస్థులు రాష్ట్రంలో ఎక్కడ సంచరిస్తున్నా వారి కదలికలను ఆర్టీజీఎస్ సీసీకెమెరాలు ఇట్టే పట్టేస్తున్నాయి. ఆయా కేసుల్లో ఆ నిందితులకు సంబంధించిన సమాచారాన్ని కేసు నమోదైన పోలీసు స్టేషన్ పోలీసులకు చేరవేస్తున్నాయి.దీంతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి నిందితులను ఇట్టే పట్టుకుంటుని కేసులను విజయవంతంగా ఛేదిస్తున్నారు.
Prajavartha Online Telugu News