– మంత్రి కొండపల్లి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, రాష్ట్రంలో కొబ్బరి రైతులకు, రైతు ఉత్పత్తులకు అదనపు ఆదాయం చేకూర్చేలా భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి అధారిత ఉత్పత్తులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని పొల్లాచ్చిలో గల ‘ఎకో కాయిర్ క్లస్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ప్లాంట్‌ను శనివారం మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ MSME శాఖకు చెందిన ‘స్ఫూర్తి’ (SFURTI) పథకం కింద ఏర్పాటు చేసిన ఈ క్లస్టర్ పనితీరును ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
తమిళనాడు పర్యటనలో భాగంగా పొల్లాచ్చి ప్లాంట్‌లోని సుమారు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ (CFC)ను మంత్రి సందర్శించి, అక్కడ కొబ్బరి అనుబంధ పదార్థాలతో రూపొందుతున్న విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న PVC టఫ్టెడ్ కాయిర్ మ్యాట్స్, జియో-టెక్స్‌టైల్స్, కోకోపీట్ బ్లాక్స్, మరియు మల్చ్ మ్యాట్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు.
కొబ్బరి నార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు పొల్లాచ్చి ‘కాయిర్ క్లస్టర్’ ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.. “కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నార పరిశ్రమను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి వక్కాణించారు. పొల్లాచ్చి క్లస్టర్‌లో పాటిస్తున్న అత్యాధునిక సాంకేతికత విధానాలు, సూచనలు మన రాష్ట్రంలో కూడా అన్వయించి చూడాలన్నారు.. వ్యర్థంగా పారేసే కొబ్బరి పీచు నుండి అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తూ, స్థానిక రైతులకు మరియు మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.
పొల్లాచ్చి క్లస్టర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్లాంట్లను ఏర్పాటు చేసి, మన కొబ్బరి రైతులకు అదనపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. పర్యావరణ హితమైన ఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా మన రాష్ట్రంలోని ఎం.ఎస్.ఎం.ఇ (MSME) యూనిట్లను ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కోయంబత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ షణ్ముగ శివ, సీఈవో మిస్టర్ కన్నన్, స్థానిక రైతులు మంత్రి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News