-బ్రాండిక్స్ కంపెనీ బాధితులకు న్యాయం చేయాలి
-ఎన్నికల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.993లు పెంచిన మోదీ
-ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, రాయితీలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని మంగంపేట బైరైటీస్ గనుల సంస్థ కేవలం ఏడాదిపాటు లేదా రెండేళ్లలోపే నడిచే పరిస్థితి ఉందని, అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) లీకులిస్తూ కార్మిక వర్గాన్ని గందరగోళానికి గురిచేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు విజయవాడ దాసరి భవన్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీఎండిసి మంగంపేట బైరైటీస్ గని యొక్క జీవితకాలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమేనని ఊహాగానాలు వస్తున్నాయన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలలోని 436 క్వారీ లీజులను ఏపీఎండిసి ఆధ్వర్యంలో నడపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కానీ అవి ప్రారంభం కాకుండానే ఏపీఎండిసి సంస్థలో అన్ని బ్రాంచులలో పనిచేస్తున్న కార్మికులను ఆయా క్వారీలు ఉన్న ప్రదేశాలకు డిప్యూటేషన్ మరియు టెన్ఫర్ రూపంలో పంపించడం జరుగుతుందన్నారు. అవి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదనీ, కార్మికులకు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకుండా అక్కడికి పంపించారనీ, వారు అక్కడ వారం రోజులగా ఇబ్బంది పడుతున్నారన్నారు. వాళ్లు అక్కడికి వెళ్ళుటకు అయినా రవాణా ఖర్చులు కూడా ఏపీఎండీసీ సంస్థ ఇస్తారని నమ్మకం కూడా లేదని, ఒక కార్మికుడికి రూ.100లు ఖర్చయితే సంస్థ వారు రూ.40 లు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు..బైరైటీస్ కు సంబంధించిన ఏ, బి, సి ప్లస్ డీ ప్లస్ డబ్ల్యు గ్రేడ్ కు ఎక్స్పోర్ట్ ను టెండర్ లకు పిలిచి నాలుగురు ఎక్స్పోర్ట్ లు ఎన్నిక అయినా కూడా ఎక్స్పోర్ట్ ఆపేశారనీ, కానీ సి ప్లస్ డీ ప్లస్ డబ్ల్యు గ్రేడ్ ను ఆపలేదనీ, అందుకు కారణం 60 లక్షల బల్క్ టెండర్ ను ఎంప్రదా కంపెనికి రేటు తగ్గించి ఇవ్వడంతో, ఎంప్రద మాత్రమే సి ప్లస్ డీ ప్లస్ డబ్ల్యు గ్రేడ్ ను ఎక్స్పోర్ట్ చేస్తుందన్నారు. ఇతర ఎక్స్పోర్ట్ కంపెనీలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత లేనందున ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎండిసిని అడ్డం పెట్టుకుని రూ.9000 కోట్లను ఏపీఎండిసి ద్వారా తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం మరో రూ.3000 కోట్లు కోసం 436 క్వారీ లీజులను చూపించే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ ఏపీఎండిసి హెడ్ ఆఫీస్ అయిన విజయవాడలో ఉండరనీ, ఆయన ఏపీఎండిసిని ఒక ఆర్థిక వనరుగా మాత్రమే చూడటం విచారకరమన్నారు. 60 లక్షల టన్నుల బైరైటీస్ నిక్షేపాలను కేవలం ఒకే కంపెనీకి కట్టబెట్టడంలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగపేటలోని అక్రమార్కుల నుంచి ఏపీఎండీసీని కాపాడాలని, బైరైటీస్ టెండర్ ను ఒక కంపెనీకి ఇవ్వటంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గర ఇటీవల బ్రాండిక్స్ కంపెనీ దగ్గర ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. అక్కడ చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆ ప్రాంత వాసులంతా పర్యావరణాన్ని పరిరక్షించాలని, చుట్టూ ప్రహరీగోడ కట్టేలోపు తమ భూములకు పరిహారం ఇవ్వాలని కోరగా, జనసేన, టీడీపీ నేతలు వారికి హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని అమలు చేయాలంటూ కార్మికులు, ప్రజలు ఆందోళనబాట పట్టగా, వారిని పట్టించుకోకుండా పెద్దఎత్తున జేసీబీలు తీసుకొచ్చి బలవంతంగా బ్రాండిక్స్ కంపెనీ చుట్టూ ప్రహరీ కడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే బ్రాండిక్స్ కంపెనీ ఏర్పాటు సమయంలో అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్ని తక్షణమే అమలు చేయాలన్నారు.
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీది అవకాశవాద రాజకీయాలకు తెరదీసే నైజమని విమర్శించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే వాణిజ్య గ్యాస్ ధరను దిల్లీ నుంచి గల్లీ వరకు రూ.993లు పెంచారన్నారు. ఇది చిన్న వ్యాపారులపై పెనుభారం పడనుందని, అనేక టిఫెన్ సెంటర్లు మూతపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ఆధారంగా మోదీ అసలు రూపం బయటపడిందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు అదానీ గూగూల్ డేటా సెంటర్ పేరుతో పెద్దఎత్తున ఉపన్యాసాలు చేస్తున్నారని, గూగుల్ డేటా సెంటర్‌తో పెద్దఎత్తున ఐటీ సెంటర్ అభివృద్ధి చెందుతుందని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారన్నారు. గూగుల్ డేటా సెంటర్‌కు 650 ఎకరాలు కేటాయించారని, విద్యుత్, నీటి తదితర వనరులు కల్పించడమే కాక, రూ.22,500 కోట్లు ప్రభుత్వమే రాయితీగా ఆ కంపెనీకి ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్‌తో పర్యావరణానికి ముప్పు లేకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలన్నారు. ఇంతాచేస్తే గూగూల్‌తో వచ్చే ఉద్యోగాలు 500 మాత్రమేనని అన్నారు. ఈ తరహాగా ప్రభుత్వ భూములను కారుచౌకగా కేటాయించి, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పాల్పడుతోందని తూర్పారబట్టారు. కూటమి ప్రభుత్వం ఏపీలో చేసిన భూ కేటాయింపులపై, ఇచ్చిన రాయితీలపై, తద్వారా జరిగే ఉద్యోగ, ఉపాధి కల్పనలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్ఐఆర్ విధానంతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఓటింగ్ హక్కును కోల్పోతున్నారన్నారు. ఎస్ఐఆర్ వలన పశ్చిమ బెంగాల్లో 90 లక్షలకు పైగా ఓట్లను, తమిళనాడులో 36 లక్షలకు పైగా ఓట్లను తొలగించారన్నారు. బీజేపీ వ్యతిరేక వర్గాలు తమ ఓటు హక్కు కోల్పోయే కుట్రలకు తెరదీశారని అన్నారు. ఈ తరహాగా ఓటు హక్కు కోసం పోరాడే ఉద్యమాన్ని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని, ఉద్యమ బాటకు సన్నద్దులు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ఆస్తి పన్నులు రికార్డు స్థాయిలో వసూలు చేశామంటూ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. అదే సమయంలో ఇంకా ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే.. మే నెలాఖరు వరకు ఆస్తి పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని సీఎం చంద్రబాబుకు సూచించారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజ, పి.దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News