గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని, స్పందించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడానికి వార్డ్ ల వారీగా నివేదిక సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఎస్ఈని ఆదేశించారు. గురువారం పెద్దపలకలూరు రోడ్, ఉద్యోగ నగర్, ఎస్వీఎన్ కాలనీ, తారకరామ నగర్, నేతాజీ నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, పెండింగ్ పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ లవారీగా ప్రారంభించిన అభివృద్ధి పనులను అసంపూర్తిగా చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆయా పనుల కాంట్రాక్టర్లను పిలిచి నోటీసులు ఇవ్వాలని, స్పందించకుంటే నిర్దేశిత నిబందనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, గడువు మేరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్ లో టెండర్ పొందిన కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, 2 రోజుల్లో పనులు ప్రారంభించాలన్నారు. పెద్ద పలకలూరు రోడ్ లో ప్యాచ్ వర్క్ లు చేపట్టాలన్నారు. తారకరామ నగర్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించి, విస్తరణ ప్రభావిత భవన యజానులకు నోటీసులు అందించాలని పట్టణ ప్రణాళిక అధికారులను, క్లియర్ గా ఉన్న ప్రాంతంలో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నేతాజీ నగర్ చెరువుని పరిశీలించి, చెరువు చుట్టూ వ్యర్ధాలు డంప్ చేయడం వలన చెరువు పూడిపోతుందని, ప్రతి రోజు రాత్రి సమయాల్లో పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య సిబ్బంది అక్కడే ఉండి వ్యర్ధాలు తరలించే వాహనాలను సీజ్ చేయాలన్నారు. అలాగే పెద్ద పలకలూరు చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఈఈని ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఈఈ(ఇంచార్జి) కళ్యాణరావు, డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సోమశేఖర్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News