Breaking News

విద్యుత్ చార్జీలు యూనిట్ కి ఒక రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది…

ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు యూనిట్ కి ఒక రూపాయి తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో శనివారం 4. 31 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కె.వి. సబ్ స్టేషన్ ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచిందని, ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీలను ట్రూ డౌన్ పేరుతో ఇప్పటికే 13 తగ్గించామన్నారు. త్వరలో యూనిట్ కు ఒక రూపాయి వరకు తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు తమ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యమని, వేసవిలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా అందిస్తున్నామన్నారు. నూజివీడు నియోజకవర్గంలో 280 కోట్ల రూపాయలతో విద్యుత్ శాఖ ద్వారా పలు పనులు చేపట్టామన్నారు. 109 ఫీడర్ల ఏర్పాటు లక్ష్యంకాగా, 60 వరకు పూర్తిచేశామని, కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేసి, మిగిలిన ఫీడర్లను కూడా త్వరితగతిన ఏర్పాటుచేస్తామన్నారు. పి .ఎం. సూర్యగర్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటి సోలార్ కనెక్షన్లు లక్ష్యంకాగా, మన రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్ అందించిందని, ఇది మన ముఖ్యమంత్రిపై ప్రధానమంత్రికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నదన్నారు. నూజివీడు నియోజకవర్గంలో 75 కోట్లతో 6 వేల సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారధి విజ్ఞప్తి మేరకు 33/11 కెవి. సబ్ స్టేషన్లు 2 ఏర్పాటు చేస్తామని, 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుపై పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నూజివీడు నియోజకవర్గంలో వ్యవసాయానికి పగలు 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు మంత్రి అంగీకరించారు. జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులన్నింటినీ పరిష్కరించి త్వరలో విద్యుత్ కనెక్షన్ అందిస్తామన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని పేదప్రజలకు ఏ విధంగా సహాయం చెలనే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారన్నారు. గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచితే, తమ ప్రభుత్వం ప్రస్తుతం యూనిట్ కు 13 పైసలు తగ్గించిందని, త్వరలో మరింత తగ్గించేందుకు ఆలోచిస్తున్నదన్నారు. గత ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలకు 50 శాతం ఎక్కువ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం 4500 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థకు బకాయిలు పెట్టి ప్రజల నుండి ట్రూ అప్ చార్జీల పేరుతో వసూలు చేయమని తమకు చెప్పిందని, కానీ ముఖ్యమంత్రి ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం నుండే చెల్లించారన్నారు. దేశ .విదేశాలలోని పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా గుర్తించి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారన్నారు. అగిరిపల్లి ప్రాంతంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయని, పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్యుత్, లో ఓల్టేజ్ సమస్య లేకుండా 33/11 కెవి సబ్ స్టేషన్లు 2 ఏర్పాటుచేయాలని, అదేవిధంగా 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రైతులకు సాగుకు పగటిపూట 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కోరారు.

కార్యక్రమంలో సిపిడిసిఎల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ హనుమంతయ్య, ప్రముఖులు కాపా శ్రీనివాసరావు, ఆరెపల్లి శ్రీనివాసరావు, సంగతి రంగారావు, సిహెచ్. శివరామకృష్ణారావు, నద్దే రఘు, లీల శివరామకృష్ణ ప్రసాద్, పరిమి ఏసేబు, బి. శివరాంప్రసాద్, వై. గోపాల్, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *