– పరీక్షకు 6605 మంది విద్యార్థులు హాజరు.
– పరీక్ష నిర్వహణ లో పాల్గొన్న 450 మంది సిబ్బంది.
– అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– పేదవారు సైతం దేశ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించే స్థాయికి చేరుకోవాలి.
– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 27 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణలో 450 మంది సిబ్బంది పాల్గొని సమన్వయం చేశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 7392 విద్యార్థుల్లో 6605 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించగా, 787 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ కట్టుదిట్టమైన భద్రత మరియు ప్రత్యేక పర్యవేక్షణ మధ్య పరీక్షలు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ల సమన్వయంతో ఏర్పాట్లు
ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేశారు. పలు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ లు, డీఆర్వో లు, వక్ఫ్ బోర్డు సీఈఓ యాకుబ్ భాష స్వయంగా కేంద్రాలను సందర్శించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణలో, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీల ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయి. ప్రతి పరీక్ష కేంద్రంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే కాక విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఫస్ట్ ఎయిడ్ సేవల కోసం ఏఎన్‌ఎం నర్సులను ప్రత్యేకంగా నియమించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విజయవాడకు చేరనున్న జవాబు పత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల నుంచి జవాబు పత్రాలు కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి తరలించబడుతున్నాయి. అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లో ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో జవాబు పత్రాల మూల్యాంకనం (కరెక్షన్) ప్రక్రియ చేపట్టనున్నారు.
విజయవంతానికి కృషి చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా యంత్రాంగం, అధికారులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా దేశ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించే స్థాయికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యం అని అబ్దుల్ అజీజ్ తెలిపారు. ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు మార్పుకు “తాలీం-ఏ-హునర్” కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Prajavartha Online Telugu News