Breaking News

తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు

-నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలి
-పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి
-గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీరు
-వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్ల ఏర్పాటు
-గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి ఖనిజాలు లవణీయత తదితరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా… గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యార్ధుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీరు అందించడం గ్రామీణ ఆరోగ్యానికి, అభివృద్ధికి అత్యంత కీలకం. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో వాటిని తొలగించే అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధ జలాలను ప్రజలకు అందించాలి. కేవలం తాగడానికే కాకుండా, వంట, స్నానం, దుస్తులు ఉతకడం వంటి ఇంట్లో వాడే అన్ని అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలి. నీటి వల్ల చర్మవ్యాధులు రాకుండా కూడా చూడాలి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించడానికి వైద్య శిబిరాలు నిర్వహించాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి.
ప్రతి నెలా నేనే స్వయంగా రివ్యూ చేస్తా
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. క్యాబినెట్ ఆమోదం తెలిపిన 3 వేల నీటి ఎద్దడి గ్రామాల్లో తాగు నీటి పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో స్వయంగా పర్యటించి, ప్రజల ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటాను. నీటి సమస్యను తీర్చడానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరుతాను. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఒక టార్గెట్ పెట్టుకుని, అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయాలి. ఈ తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై స్వయంగా ప్రతి నెల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాను. పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని దరిచేరనీయొద్దు. ప్రభుత్వం ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను తొందరగా పూర్తి చేసి, వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాల”ని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *