-గుంటూరు జీజీహెచ్ మాతా-శిశు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ప్రారంభమైన శస్త్ర చికిత్సలు
-ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో 10 థియేటర్లు సిద్ధం
-శిశువుల అత్యవసర చికిత్స కోసం టోటల్ బాడీ కూలింగ్ మెషిన్ లు, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు రెడీ
-సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణానికి, జీoఖానా తరపున రూ. 100 కోట్ల వ్యయo
-మెషిన్లు, పరికరాల కొనుగోళ్లకు రూ. 27 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు ఉత్తమ వైద్య సేవల్ని చేరువ చేయడంలో కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో ఒకే భవనంలో మహిళలు, గర్భిణిలు, శిశువులు, పిల్లల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఉచిత వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూ.127 కోట్ల వ్యయంతో 600 పడకలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో డాక్టర్ కనూరి-జింఖానా ‘మాతా శిశు సంరక్షణ సూపర్ స్పెషాల్టీ బ్లాక్ ‘లో మహిళల మాతృత్వానికి సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన శస్త్ర చికిత్సల కోసం సిద్ధంచేసిన ఏడు ఆపరేషన్ థియేటర్లు గురువారం నుంచి అందుబాటులోనికి రావడం ప్రారంభమైంది. తొలి రోజు (గురువారం)) రెండు ఆపరేషన్లు జరిగాయి. ఇవి కాకుండా శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ సిద్ధం చేశారు. ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాకులో
వైద్య సేవలను ఇటీవల సీఎం శ్రీ చంద్రబాబు ప్రారంభించారు. ఎక్విప్మెంట్స్ పనితీరు గమనించడం పూర్తి కావడంతో అత్యాధునిక సౌకర్యాల మధ్య శస్త్ర చికిత్సలు గురువారం నుంచి మొదలయ్యాయి. శిశు సంరక్షణలో కీలకంగా వ్యవహరించే ‘టోటల్ బాడీ కూలింగ్’, హై ప్రీక్వెన్సీ వెంటిలేటర్లు వంటి అత్యాధునిక సదుపాయలు ఈ బ్లాక్ లో కల్పించారు.
ఐదు అంతస్తుల్లో కలిపి సిద్ధం చేసిన 600 పడకల్లో 300 గైనిక్, 120 నవజాత శిశువులు, 12 ఏళ్లలోపు కలిగిన చిన్నారుల కోసం 180 చొప్పున పడకలు కేటాయించారు. వేలల్లో, లక్షల రూపాయల్లో వ్యయంతో కూడుకున్న వైద్యo
పేదలకు ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉంది. క్లిష్టమైన కేసులకు గుంటూరు జీజీహెచ్ రిఫరల్ సెంటర్ గా సేవల్ని అందిస్తోంది.
మంత్రి శ్రీ సత్యకుమార్ చొరవతో..
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ వైద్య సేవల్లో భాగంగా అత్యాధునిక పెట్ స్కాన్ సౌకర్యాన్ని రూ.18 కోట్లతో కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇందుకు అదనంగా మహిళలు, శిశువుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం సూపర్ స్పెషాల్లీ బ్లాక్ ను అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధంచేసింది. నిర్మాణాలకు రూ.100 కోట్లను జింఖానా వారు వ్యయం చేయగా మిగిలిన రూ. 27 కోట్లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వం తరపున సమకూర్చారని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఎస్ వి రమణ వెల్లడించారు. అవసరాలకు నియామకాలను చేపట్టేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇక్కడ ఏడుగురు గైనిక్ ప్రొఫెసర్లు,ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 18 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. 60 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్స్ ప్రస్తుతం గైనిక్ విధుల్లో ఉన్నారని సూపర్డెంట్ వివరిoచారు. గురువారం రెండు ఆపరేషన్ జరిగాయని, అవసరాలకు అనుగుణంగా వాటి సంఖ్య పెంచుతామని, ఇందుకు తగ్గట్లు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశామని చెప్పారు.
డెలివరీ థియేటర్ల పక్కనే నవజాత శిశు సంరక్షణ కేంద్రం*
అత్యవసర సిజేరియన్ ప్రసవాలు, గర్భ సంచి తొలగింపు, అండాశయ సిస్ట్ వంటి గైనిక్ శస్త్రచికిత్సలు, ట్యూబెక్టమీ సహా కుటుంబ నియంత్రణ ఆపరేష న్లు, రక్తస్రావం వంటి అత్యవసర ప్రసూతి కేసుల కోసం తక్షణ సర్జరీలు, డీఎం అండ్ సీ ఎంవీఏ ప్రొసీజర్లు ఇక్కడ చేసేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు/మెషిన్లు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో సమకూరాయి. హై-రిస్క్ కేటగిరి వారికి ప్రత్యేక వార్డు ఉంది. అబెస్ట్రిక్ ఐసీయూ ప్రత్యేకంగా ఉంది. ప్రసవానంతరం శిశువుల్లో ఉన్నత చికిత్స నిమిత్తం పంపించాల్సిన ‘స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్’ డెలివరీ రూము పక్కనే ఉందని గైనిక్ హెచ్ ఓ డీ డాక్టర్ అరుణ వేము తెలిపారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఆధునిక వసతులతో ఏర్పడ్డ ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాకులో భవిష్యత్తులో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోనికి వస్తుందన్న ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. డెలివరీ థియేటర్ల పక్కనే నవజాత శిశువు సంరక్షణ కేంద్రాలు చాలాచోట్ల లేవు. డెలివరీ రూముల నుంచి దూరంగా ఉండే నవజాత శిశువు సంరక్షణ కేంద్రాలకు తీసుకువెళ్లే సమయంలో ఉండే వ్యయప్రయాసలు ఇకపై ఉండవని డాక్టర్ అరుణ చెప్పారు. వర్క్ స్టేషన్లు, ఇతర అత్యాధునిక పరికరాలు/ మెషిన్లు ఇక్కడ కల్పించారు. గైనిక్ విభాగాల్లో ఏడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.
శిశువుల కోసం ‘టోటల్ బాడీ కూల్ మెషిన్లు’
బిడ్డ పుట్టిన వెంటనే ఏడ్వకుండా ఉంటే మొదడుపై దుష్ప్రభావం పడకుండా ఉండేందుకు ‘టోటల్ బాడీ కూల్ మెషిన్’లు ఉపయోగిస్తున్నారు. ఇవి ప్రస్తుతం 4 అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా సౌకర్యం ఇతర ఆసుపత్రుల్లో లేదు. అత్యవసర చికిత్సలో భాగంగా శిశువులు నిమిషానికి 120 సార్లు గాలిపీల్చుకునే విధంగా ‘హై ప్రిక్వెన్సీ వెంటిలేటర్లు’ 10 వరకు సూపర్ స్పెషాల్టీ బ్లాక్ లో ఉన్నాయి. అలాగే… గర్భంలో ఉన్నప్పుడు పేగులో చేరే వ్యర్థం ద్వారా శ్వాశ పీల్చుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ‘నైట్రిక్ ఆక్సైడ్’ (వాయువు) సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పీడియాట్రిక్ విభాగం హెచ్ ఓ డీ దేవకుమార్ చెప్పారు.
Prajavartha Online Telugu News