-సోమవరంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు
-మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం ద్వారా దోమల బెడద, మురుగు నీటి దుర్వాసన తప్పిందని నాగబాబు కి సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపిన స్థానిక మహిళలు
2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించిన కె. నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతితో కూడిన దూరదృష్టికి ప్రతిరూపం ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. నందిగామ మండలం, సోమవరం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ ను కె. నాగబాబు ఆదివారం సందర్శించారు. మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం వలన ప్రయోజనాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం ద్వారా దోమల బెడద తప్పిందని, మురుగు నీటి దుర్వాసన నుండి ఉపశమనం లభించిందని స్థానిక మహిళలు నాగబాబు కి సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. దోమల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అటువంటి చోట మ్యాజిక్ డ్రెయిన్ నిర్మించనున్నట్లు, సాధారణ కాలువలు నిర్మించే వ్యయంలో 16 శాతం వ్యయం మాత్రమే వీటి నిర్మాణానికి ఖర్చవుతుందని, వీటి ద్వారా నీటి శుద్ధి బాగా జరిగి భూగర్భానికి చేరుతుందని, భూగర్భ నీటి నిలువ పెరుగుతుందని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని నాగబాబు వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ చేపడుతున్న అనేకమైన అభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల్లో మేజిక్ డ్రైన్ నిర్మాణాలు ఒక మచ్చుతునక లాంటిదని అన్నారు. నిజాయితీ, మంచితనం, విశ్వసనీయత, సేవాభావం కలిగిన నాయకుడు ప్రభుత్వంలో అత్యున్నతమైన కీలక స్థానంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరుగుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని, ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్నో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ఆచరణలోకి వస్తున్నాయని నాగబాబు స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ సుదూర లక్ష్యాలతో, అనేకమైన అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారని, కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అంకితభావం కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటే పరిపాలన ప్రజలకు ఎంత చేరువవుతుందో “మేజిక్ డ్రైన్” లాంటి అభివృద్ధి పనులను పరిశీలిస్తే అర్థం అవుతుందని అన్నారు. ఈ.జీ ఎస్. జాయింట్ కమిషనర్ జె. సునీత మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులు, వ్యయం, ప్రయోజనాలను గురించి కె. నాగబాబు కి వివరించారు. “మేజిక్ డ్రైన్”ల ద్వారా భూగర్భ నీరు నిలువ, శుద్ధి సులువవుతుందని, పరిశుభ్రతతో పాటు, ప్రజల ఆరోగ్యాలకు రక్షణ లభిస్తుందని నాగబాబు వెల్లడించారు. మేజిక్ డ్రైన్ పరిసరాల్లో నివాసం ఉండే ప్రజలకు నిత్యం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే బాధ తప్పుతుందని, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదని, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా “మేజిక్ డ్రైన్”లను విస్తరించనున్నట్లు నాగబాబు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ అరవపల్లి రాము, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News