-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం, బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్, హెచ్‌బీ కాలనీ, ఊర్మిళా సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో రెండు సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
చర్చ్ సెంటర్ వద్ద క్రాంబే రోడ్ నుండి ఊర్మిళా సుబ్బారావు నగర్ రోడ్డుకు బైపాస్ రోడ్డును దాటి 2.0 మీ × 2.0 మీ పరిమాణంలో సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అలాగే ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్ నుండి జోజి నగర్ రోడ్డుకు బైపాస్ రోడ్డును దాటి మరో 2.0 మీ × 2.0 మీ సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు.
చర్చ్ సెంటర్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు 42 మీటర్ల పొడవుతో పాటు 46 మీటర్ల డ్రెయిన్‌ను కలిగి ఉండగా, దీని ద్వారా సుమారు 3,69,854 చదరపు మీటర్లు క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. హెచ్‌బీ కాలనీ, కుందల బజార్, క్రాంబే రోడ్ ప్రాంతాలకు దీనివల్ల వరద ముప్పు తగ్గనుంది.
జోజి నగర్ వద్ద నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు 42 మీటర్ల పొడవుతో పాటు 38.50 మీటర్ల డ్రెయిన్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా సుమారు 2,21,000 చదరపు మీటర్లు
క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు వేగంగా పారుదల అవుతుంది. నాగయ్య హోటల్ సెంటర్, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్, టెలిఫోన్ కాలనీ, లలితా నగర్ రోడ్, రైతు బజార్ రోడ్ ప్రాంతాల్లో నీటి నిల్వల సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని కమిషనర్ తెలిపారు.
ఈ పనులు పూర్తయిన అనంతరం వర్షపు నీరు వేగంగా డ్రెయిన్ల ద్వారా తరలిపోవడంతో రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. అధికారులు పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News