-పమిడిముక్కల మండలం గురజాడలో ఎస్.టి కాలనీని సందర్శించిన కలెక్టర్
పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలను పాఠశాలకి పంపించి కుటుంబం నుండి పేదరికం పారద్రోలాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. పమిడిముక్కల మండలం పమిడిముక్కల మండలం గురజాడ ఎస్టి కాలనిని ఆదివారం కలెక్టర్ నివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ ని కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు. తమకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవని, వీటి కారణంగా తాము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పొందలేకపోతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కడు పేద స్థితిలో ఉన్న ఎస్.;టి కుటుంబాల పరిష్టితిని ,వారి పేదరికాన్ని చూసే కలెక్టర్ చలించిపోయారు. వెంటనే స్పందించి ఎస్.టి. కాలనీలో నివసించే కుటుంబాలలో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని కుటుంబాలకు వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాలనీలోని చిన్న పిల్లలు విద్యాభ్యాసం గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. విద్య ఒక్కటే పేదరికం నుండి బయటపడేందుకు మార్గమని, ఇకనైనా వారి పిల్లలను పాఠశాలలకు పంపించి విద్య అభ్యసించేలా చూడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని, అమ్మఒడి పధకం కింద బడిఈడు పిల్లలను బడికి పంపించే తల్లికి ఏటా 15 వేల రూపాయలు అందిస్తున్నదన్నారు. అంతేకాక పాఠ్యపుస్తకాలు, నోట్స్ పుస్తకాలూ, యూనిఫారంలు, బూట్లు వంటివి కూడా ఉచితంగా అందిస్తారని, జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో పౌష్టికారాన్ని కూడా అందిస్తున్నారన్నారు. ఎస్.టి.. కులాల జీవన విధానం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాదన్నారు. సంబంధిత సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఎస్.టి కాలనీ నివసించే వారికి రేషన్, ఆధార్ కార్డులు అందేలా చూడడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.టి కాలనీలో స్వంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. వారి పిల్లలకు మంచి విద్యతోపాటు వసతి గృహాలలో ప్రవేశం కల్పిస్తామన్నారు. శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ స్కూల్ భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఆ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రుక్మాంగదయ్య, జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు, మండల తహసీల్దార్, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News