-విజయవాడ రిఫెరల్ కేసులు తగ్గాలి
-ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేయించాలి
-దాతలు ఇచ్చిన పరికరాలను వినియోగించాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా వైద్య సిబ్బంది నిస్వార్థంగా కష్టించి పని చేయాలనీ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. .
తొలుత మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ గురుకుల పాఠశాలలో ఆదివారం అస్వస్థతకు గురైన 14 మంది చిన్నారులు ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ ప్రత్యేక వార్డులలో చికిత్స పొందుతున్న బాధితుల బెడ్ల వద్దకు వెళ్లి పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులకు మంత్రి పేర్ని నాని ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.
సోమవారం మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం నిర్వహించారు. తొలుత సంఘం చైర్మన్ హోదాలో కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారుఅజెండా అంశాలు ఆసుపత్రి సూపరెండెంట్ వివరించారు.
ఈ సందర్బంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ , జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నూతనంగా ఎంపికైన చలమలశెట్టి గాంధీ, చీలి రవీంద్ర , నిమ్మగడ్డ సత్య ప్రకాష్ , ఉరిటి రాంబాబు లను అందరికి పరిచయం చేశారు. వీరు వైద్యపరమైన సహాయం కోసం వచ్చే ప్రజల కోసం పనిచేస్తారని వారికి మీ అందరి తోడ్పాటు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు తమ ఆరోగ్యం మెరుగుపర్చు కొనేందుకు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారని వారికి తక్షణమే వైద్య సహాయం కల్పించాల్సిన బాధ్యత ఆసుపత్రి అభివృద్ధి కమిటీపై ఉందన్నారు. గైనిక్ పరమైన సమస్యలకు నిరుపేదలైన తల్లి పిల్లలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికు నిర్దాక్షిణ్యంగా రిఫరల్ కేసులు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి నుంచి తగ్గాలని, కరోనా విలయం కాలంలో పేదలకు భారీ ఊతంగా నిలిచిన ఆరోగ్య శ్రీ పథకం అమలులో అలసత్వం పనికిరాదన్నారు. దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబాలకు ఆసుపత్రి, శస్త్రచికిత్స అవసరమయ్యే తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం సంవత్సరంలో 2 లక్షల రూపాయలు ఈ పథకం పరిధిలోకి వస్తాయని, పిల్లల వైద్యంలో ఎంతమంది చిన్నారులను ఆరోగ్యశ్రీలో గుర్తించి వైద్యం చేశారని ఆ వివరాలు తనకు తెలియచేయాలని మంత్రి ఆరోగ్యమిత్రను కోరారు. కరోనా విపత్కర సమయంలో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేరిన రోగులందరికి ఎంతో విలువైన వైద్య సేవలు అందించి సిబ్బంది ఎంతో మంచి పేరు గడించారని, ఆ గుర్తింపు ఇప్పుడూ దక్కించు కోవాలన్నారు.
తర్వాత జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, రోగులకు వైద్యం అందించే విషయంలో ఎటువంటి వివక్షత చూపరాదని వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి, రోగులకు వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, డాక్టర్ల వివరాలు, రోజు ఆస్పత్రికి వచ్చే రోగులు, డిశ్చార్జ్ ల గురించి అడిగి తెలుసు కొన్నారు. తాము 97 మంది నర్సులు ఉన్నామని 11 మంది కాంట్రాక్టు నర్సులు ఆరోగ్యశ్రీ విభాగం లోనే వుంటున్నారని తమకు పని వత్తిడి ఎంతో పెరిగిందని నర్సింగ్ సూపరెండెంట్ తెలిపింది. ఏలూరు ప్రభుతసుపత్రిలో నర్సుల సంఖ్య మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి సంఖ్యతో సరిపోల్చితే చాల ఎక్కువని సూపరెండెంట్ డాక్టర్ జయకుమార్ అన్నారు. ఈ విషయమై జోక్యం చేసుకొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కార్డియాలజీ, న్యూరో విభాగం ఉందని అందుకే అక్కడ నర్సింగ్ స్టాఫ్ అధికంగా ఉంటారన్నారు. ఎందుకు మీరు ప్రభుత్వ ప్రవేట్ నర్సింగ్ కళాశాలలో చదివే విద్యార్థునులను ప్రభుత్వాసుపత్రిలో వారి ఖాళీ సమయాలలో వినియోగించుకోకూడదన్నారు . జిల్లా ప్రభుత్వాసుపత్రి పలు వార్డులలో సి సి కెమారాలు పని చేయడం లేదని, ముఖ్యంగా పిల్లల వార్డులో ఆ కెమెరాలు పని చేయడం లేదని చిలకలపూడి సి ఐ ఆర్. అంకబాబు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులకు తెలిపారు. డెంటల్ సివిల్ సర్జన్ కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవాలని మంత్రి సూచించారు. అలాగే ఎనస్థీషియన్ ( మత్తు వైద్యుడి)కు సహాయుడిని నియమించుకోవాలన్నారు.
అత్యవసర మందుల కొనుగోలుకు సంబంధించి సంబంధిత విభాగాల అధిపతులు ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా అజెండాలో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆసుపత్రుల్లో డాక్టర్లకు, సిబ్బందికి రోస్టర్ ప్రకారం విధులు కేటాయించాలన్నారు. ఆస్పత్రిలోని తాగునీటి ప్లాంట్ వెంటనే మరమ్మతు చేసేందుకు అనుమతించారు. హాస్పిటల్లో నిర్వహిస్తున్న సేవలపై ప్రతి ఒక్కరూ పర్యవేక్షణ చేయాలన్నారు. శానిటేషన్, ఫుడ్ కాంట్రాక్టర్లు నియమ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నది, లేనిది పరిశీలించాలన్నారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, జాయింట్ కలెక్టర్ శివశంకర్, ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు, డిఎంఅండ్ హెచ్వో డాక్టర్ సుహాసిని , డిసిహెచ్ఎస్ డాక్టర్ కె.జ్యోతిర్మణి , సూపరింటెండెంటు, కన్వీనర్ డాక్టర్ ఎం.జయకుమార్, ఆర్ ఎం మల్లిఖార్జునరావు, డాక్టర్ అల్లాడ శ్రీనివాస్, డాక్టర్ జగదీష్ ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News