-ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-ఓటీఎస్ పై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగరం ప్రగతి పథంలో దూసుకెళుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధికి రూ. వందల కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అదే విధంగా నియోజకవర్గ ప్రగతికి దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగానే నేడు గవర్నమెంట్ ప్రెస్ బ్రిడ్జి మరియు బుడమేరు కాలువ పాత వంతెనకు సంబంధించి పాడైన సైడ్ రైలింగ్ స్థానంలో రూ. 33 లక్షల వ్యయంతో నూతన రైలింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. దీంతో పాటు అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ బీటీ రోడ్డు అప్రోచ్ మరమ్మతు పనులను రూ. 16.77 లక్షలతో చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని ఎప్పటికపుడు పూర్తిచేసేలా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్నారు. పౌరులకు మౌలిక సదుపాయాలతో పాటు పార్కుల సుందరీకరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణపు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ.. త్వరితగతిన పూర్తిచేయవలసిందిగా అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీ శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, స్థానిక వైసీపీ కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, నాయకులు మానం వెంకటేశ్వరరావు, అంగిరేకుల విజయ్, రవి, వెంకటేశ్వరరావు, కిరణ్, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం తదితరులు పాల్గొన్నారు.
వన్ టైం సెటిల్మెంట్ స్వచ్ఛందమే: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఓటీఎస్ పై మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం నాయకులకు లేదని మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ బీటీ రోడ్డు అప్రోచ్ మరమ్మతు పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వన్ టైం సెటిల్మెంట్ విధానంపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు, వాలంటీర్లు ఎవరినీ బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారనడంలో నిజం లేదని తేల్చిచెప్పారు. లబ్ధిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు యూజర్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. కనుక అర్హులైన లబ్దిదారులందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణ విముక్తులై తమ స్వంత ఇంటి సంపూర్ణ హక్కును పొందాలని కోరారు. ఈనెల 21 వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పథకం ప్రారంభం కానున్నట్లు వివరించారు.
పేదలకు సంపూర్ణ ఆస్తి హక్కు కల్పించే పథకాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర
ఓటీఎస్ పై కనీస విషయ పరిజ్ఞానం లేకుండా తెలుగుదేశం నాయకులు మట్లాడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబుకు, నారాలోకేష్ కు తగదన్నారు. 2014–2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఓటీఎస్ వడ్డీని చెల్లించాలని ఐదుసార్లు అధికారులు ప్రతిపాదనలు పంపితే.. కనీసం ఆ వడ్డీని కూడా ఎందుకు మాఫీ చేయలేదో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు మేలు చేకూరే ఓటీఎస్ కార్యక్రమంపై పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు.. అధికారంలో ఉండగా ఇటువంటి ఆలోచన ఎందుకు చేయలేదో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క నిర్ణయంతో నేడు 52 లక్షల మందికి ప్రత్యక్షంగా లబ్ధిచేకూరుతోందని.. వారిపై ఉన్న రూ.10 వేల కోట్ల రుణ భారం తొలగిపోతోందన్నారు. అటువంటి కార్యక్రమంపై చేస్తున్న విమర్శలకు తెలుగుదేశం నాయకులు కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గ ప్రగతికి శాసనసభ్యులు మల్లాది విష్ణు అందిస్తున్న విశేష సేవలను కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కార్పొరేటర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే.. ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీ శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, స్థానిక వైసీపీ కార్పొరేటర్ ఎండీ షాహినా సుల్తానా, జానారెడ్డి, నాయకులు హఫీజుల్లా, నాగుల్ మీరా, షేక్ అమిత్, చింతా శీను, నేరెళ్ల శివ, జి. రాజు, మున్షి, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ మౌసమి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News