-ఓటీఎస్ రుణ మాఫీతో లబ్దిదారులు ఇంటిపై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తుంది..
-జగనన్న గృహాల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేయాలి..
-సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలను అందించాలి..
-జాయింట్ కలెక్టర్(హౌసింగ్) శ్రీవాస్ నూపూర్ అజయకుమార్
పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మేంట్ (ఓటీఎస్) తో రుణమాఫీ చేసి లబ్దిదారుల స్థిరాస్థులపై ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టరు (హౌసింగ్) శ్రీ వాసు నుపూర్ అజయ్ కుమార్ అన్నారు. పెదపారుపూడి మండల కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జాయింట్ కలెక్టరు శ్రీవాస్ నూపూర్ అజయకుమార్ ఓటీఎస్, జగనన్న ఇళ్ళ నిర్మాణాల పురోగతి పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ వివిధ పథకాలు ద్వారా 2012 సంవత్సరానికి ముందు ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులు గృహనిర్మాణ సంస్థ ద్వారా ఎంత రుణం తీసుకున్నప్పటికీ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) కింద నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తే వారి ఇంటిపై సంపూర్ణ హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. లబ్దిదారుల ఇళ్ళకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజును అందిస్తుందని, ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సాధారణంగా అయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువపై 7.5 శాతం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రస్తుతం అటువంటి ఛార్జీలు ఏమీలేకుండా వారి స్థిరాస్తిని గ్రామ సచివాలయంలోనే రిజిష్టరు చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్దిదారులకు ఎంతో మేలు చేసే ఈ పథకం డిశంబరు 20 వరకు అమల్లో ఉంటుందన్నారు. పెదపారుపూడి మండలంలో 180 మంది లబ్దిదారులండగా ఇప్పటి వరకు 70 మంది రుణమాఫీకి గాను రూ. 7 లక్షలు చెల్లించారన్నారు. పెదపారుపూడి మండలంలో జగనన్న గృహాల పురోగతి పై సమీక్షిస్తూ మండల పరిదిలో జగనన్న గృనిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణంలో లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐరన్, ఇసుక, సిమ్మెంట్, నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినప్పుడే ఇళ్ళ నిర్మాణ ప్రగతి వేగవంతం అవుతుందని, అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పెదపారుపూడి మండలంలో లబ్దిదారులకు మంజూరు అయిన 2536 ఇళ్లస్థలాలు మొదటి విడతలోనే నిర్మాణాలు చేపట్టామన్నారు. మండలంలో ఇప్పటి వరకు 228 గృహాలు వివిద నిర్మాణ దశల్లో ఉన్నాయని జాయింట్ కలెక్టరు తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి శాఖలవారి ఉద్యోగులు నిర్వహిస్తున్న సర్వీసు రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ లబ్దిదారులకు చేరువ చేసే ప్రభుత్వ పథకాలను నిర్ణీత కాల వ్యవధిలోనే అర్హులకు అందించాలన్నారు. జాప్యానికి తావులేకుండా క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. కోవిడ్ నియంత్రణే లక్ష్యం వాలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కరు ఇంటింటికీ వెళ్ళి ఫీవర్ సర్వే క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పరిశరాలు పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ గ్రామాల్లో శానిటేషన్, అంతర్గత రహదారులుశుభ్రత, మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలు శుభ్ర పరిచే విధంగా ఆయా గ్రామ పంచాయితీల కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందింస్తున్న పథకాల అర్హతల తెలియజేసే పట్టికలు, పోస్టర్లు ప్రజలకు తెలియజేసే విధంగా సూచిక బోర్డుల్లో ప్రదర్శించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. కార్యక్రమంలో తాహశీల్థార్లు సత్యనారాయణ యంపీడీవో మల్లేశ్వరి, గృహనిర్మాణ సంస్థ డీఈ రమేష్ బాబు,ఏఈ సోమనాధరాజు, డిఎల్పీవో నాగిరెడ్డి, వివిధ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News