నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలతో శారీరక,మానసిక దృఢత్వం పెరుగుతుందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ పాఠశాలలో గురువారం నూజివీడు నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు హైస్కూలు ప్రధానోపాద్యాయురాలు బి. హేమలత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నదని, మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు క్రీడలకు అవసరమైన క్రీడా మైదానాలు అభివృద్ధి, క్రీడా సామాగ్రి విద్యార్ధ్లకు అందుబాటులో ఉంచడం, , పి ఈటీ ల నియామకం, తదితర అన్ని కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇంట్లోని తల్లితండ్రులు కూడా పిల్లలు విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహించాలన్నారు. నూజివీడు ప్రాంతం క్రీడాకారులకు పుట్టినిల్లని, బొబ్బిలి కొండలరావు లాంటి జాతీయ స్థాయి క్రీడాకారులను ఈ ప్రాంతం నుండే వచ్చారన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, సీఎం కప్ ఆడుతున్న క్రీడాకారులు అత్యున్నత ప్రతిభ చూపీ నియోజకవర్గ, జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర స్థాయిలో సి ఎం. కప్ సాధించి నూజివీడు పేరును నిలపాలన్నారు. క్రీడలలో ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. క్రికెట్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, హాకీ వంటి క్రీడలలో అత్యుత్తమ అత్యుత్తమ శిక్షణ అందించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పాఠశాలల కోచ్ లను ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మండల యంపిపి ఆరేపల్లి శిరీషా, వైస్. యంపిపి అక్కినేని శ్రీవాణి చౌదరి, మున్సిపల్ కౌన్సిలరు కందుల సత్యనారాయణ, ధర్మాఅప్పారావు కళాశాల కరస్పాండెంట్ మెహర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News