Breaking News

ఇంధన సామర్థ్యం తో అన్ని రంగాలలో అభివృద్ధి…


-ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇంధన పరిరక్షణలో భాగస్వాములు కావాలి
-రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-నిరంతర, నాణ్యమైన విద్యుత్ తోనే ఆర్థికాభివృధి
-విద్యుత్ రంగం పటిష్టానికి ప్రభుత్వం కృషి
-ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం
-డిస్కాములకు అండగా ప్రభుత్వం.. రెండేళ్లలో రూ 28166 కోట్లు
-చౌక విద్యుత్ ద్వారా రూ 2500 కోట్లు ఆదా
-ఇంధన పొదుపు తో ప్రతి కుటుంబానికి ప్రయోజనం
-రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డులను బహుకరించిన ఇంధన శాఖ మంత్రి
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు ద్వారా రూ 3800 కోట్ల విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదా — ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి
-ఇంధన సామర్థ్యం ద్వారా 20 నుంచి 25 శాతం ఆదా చేసే అవకాశం
-జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇంధన సామర్థ్యం దోహదం
-ఇంధన పొదుపు ఉద్యమంలో మహిళలు , విద్యార్థులు భాగస్వాములు కావాలి
-స్టార్ రేటెడ్ గృహోపకారణాలతో విద్యుత్ ఆదా

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని కీలక రంగాలలో సుమారు 15000 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా చేసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వ శాఖలు , ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇంధన పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఇంధన అటవీ, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.
ఇంధన పరిరక్షణ వారోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక శక్తి విద్యుత్ రంగమని , వ్యవసాయం, పరిశ్రమలు వంటి కీలక రంగాలతోపాటు మొత్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలంటే సమృద్ధిగా విద్యుత్ అందుబాటులో ఉండాలన్నారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రజల జీవన ప్రమాణాలను నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రంలో చౌక విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పునాదులనుంచి విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసేందేంకు కీలక చర్యలు తీసుకుంటున్నారన్నారు . ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడాన్ని అరికట్టారన్నారు . ఫలితంగా విద్యుత్ కొనుగోళ్లలో బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు, ఇతర ఉత్తమ ప్రమాణాల అమలు ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ 2500 కోట్లు ఆదా చేయగలిగాయన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ కూడా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రశంసించిందని మంత్రి తెలిపారు .
విద్యుత్ రంగానికి సంబంధించి ఏ సమస్యనైన అది విద్యుత్ ఉద్యోగుల అంశాలైన సరే సానుకూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం లో ఏ ఒక్క ఉద్యోగి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు . “మాది ప్రజా ప్రభుత్వం. ప్రజలకోసం పనిచేస్తాం. ప్రభుత్వం ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తుంది “, అని మంత్రి తెలిపారు . ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 & 2020-21 సంవత్సరాలలో రూ.28166 కోట్లు విడుదల చేసిందన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని , విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు 7,329 మంది లైన్ మెన్లను నియమించామని, మరో 213 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామని ని మంత్రి తెలిపారు . విద్యుత్ సంస్థలను బలోపేతం చెయ్యడమే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారన్నారు.
కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించిన స్టేట్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ ఇండెక్స్ 2020 లో మొదటి పది అత్యుతమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గర్వ కారణం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు మరియు పరిరక్షణ ఉద్యమాన్ని మహిళలు, విద్యార్థులే ముందుండి నడిపించాలని మంత్రి కోరారు.
ఇంధన సామర్ధ్య రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను ప్రదర్శించడంలో భాగంగా పరిశ్రమలు , భవన నిర్మాణం, మునిసిపల్ రంగాలలో ఉత్తమ పనితీరు కనపరిచిన పరిశ్రమలకు అవార్డులను మంత్రి అందచేసి ఆ సంస్థలను అభినందించారు. ఇంధన సామర్థ్యం , ఇంధన పొదుపు పై జరిగిన షార్ట్ వీడియో పోటీ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి అందించారు.

కె ఎల్ విశ్వవిద్యాలయం, గుంటూరు, దక్షిణ మధ్య రైల్వే యొక్క ఎలక్ట్రిక్ ట్రాక్షన్ శిక్షణా కేంద్రం, విజయవాడ, బొబ్బిలి మునిసిపాలిటీ, M/s. దాల్మియా సిమెంట్స్, కడప, M/s. శైలజ ప్లాస్టిక్స్, అనంతపురం, M/s. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ గోల్డ్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు, డివిజనల్ రైల్వే హాస్పిటల్, విజయవాడ, , ముమ్మిడివరం నగర పంచాయతీ, తూర్పుగోదావరి జిల్లా, M/s. రెయిన్ సిమెంట్స్, యూనిట్-II, కర్నూలు జిల్లా, M/s. ఏషియన్ పెయింట్స్, వైజాగ్, M/s. గుంటూరు జిల్లా ఎడ్లపాడులోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ సిల్వర్ విభాగంలో అవార్డులకు ఎంపికయ్యాయి.

ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంత్రి ప్రోత్సహించారు. విజయవాడలోని ఎస్ఎన్ఎంసీ ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాల ప్రథమ స్థానంలో నిలువగా, విశాఖపట్నంలోని తురువోలులోని జెడ్పీహెచ్ పాఠశాల ద్వితీయ స్థానంలో నిలువగా, గుంటూరు జిల్లా జేఎంజే ఈఎం పాఠశాల తృతీయ స్థానంలో నిలిచింది.

ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం వివిధ ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు ద్వారా ఇప్పటికే రూ 3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేయటం జరిగిందన్నారు.
ఇంధన పొదుపు నినాదాల పోటీల్లో విజేతలకు ఇంధన శాఖ కార్యదర్శి బహుమతులు అందజేశారు. గుంటూరులోని జేఎంజే ఈఎం హైస్కూల్ ప్రథమ స్థానంలో నిలవగా, కర్నూలులోని శ్రీ గురురాజాజ్ ఈఎం పాఠశాల ద్వితీయ స్థానంలో నిలువగా, కృష్ణాజిల్లాలోని దావాజీగూడెం జడ్పీహెచ్ఎస్ మూడో ర్యాంక్ను గెలుచుకుంది. సెక్రటరీ విద్యార్థులందరినీ అభినందించారు మరియు ఇంధన పొదుపు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనాలని వారికి విజ్ఞప్తి చేశారు

రాష్ట్రంలో ఏడాదికి సగటున 60943 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నామని , ఇంధన సామర్థ్య చర్యలు పెద్దఎత్తున చేపట్టడం ద్వారా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్ ఆదా చేసేందుకు అవకాశం ఉందన్నారు . ఇందుకోసం ప్రభుత్వ శాఖలతో పాటు , ప్రైవేట్ సంస్థలు , ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు.
ఇంధన సామర్థ్యం వల్ల మన ఇంధన వనరులు వృధా కాకుండా అరికట్టవచ్చు. మన జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ చర్యల వల్ల కొంతవరకు కరెంటు బిల్లులు తగ్గడం వల్ల ప్రతి కుటుంబం ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేయడం అంటే రెండు యూనిట్లు ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని తగ్గించినట్టే. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతామన్నారు .
రాష్ట్రంలో విద్యుత్తు సమర్థ వినియోగాన్ని పెంచడంతోపాటు ఇంధన పరిరక్షణ ప్రోత్సహించే దిశగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో ఇంధన పొదుపు మరియు పరిరక్షణ ఉద్యమాన్ని మహిళలు, విద్యార్థులే ముందుండి నడిపించాలని ఇంధన కార్యదర్శి కోరారు. . ఇంధన పొదుపు ప్రతిఒక్కరి సామాజిక భాద్యతగా గుర్తెరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గృహాలలో బీఈఈ స్టార్ రేటెడ్ గృహోపకరణాలు, ఇంధన ఎనర్జీ ఎఫిసిఎంట్ (ఇంధన సామర్ధ్య) ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించుకోవాడం ద్వారా విద్యుత్ ను పొదుపుచేయవచ్చన్నారు . కరెంటు, నీరు వృధా చేయకుండా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *