
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శారీరక శ్రమతో పాటు మానసికోల్లాసం ఇచ్చే వివిధ క్రీడలను క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పక ప్రోత్సాహిస్తుందని , శత్రుదేశాల్లో సైతం మన జాతీయ జెండాను సగర్వంగా ఎగుర వేయగలిగేది కేవలం క్రీడాకారులు మాత్రమేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వక్కాణించారు.
గురువారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గీత రచయిత ఆర్. నారాయణమూర్తి మంత్రిని వ్యక్తిగతంగా కలిసేందుకు వచ్చారు. మంత్రి కార్యాలయం వద్ద పలు ప్రాంతల నుంచి అక్కడకు వచ్చిన ప్రజలను చూసి తన పని కన్నా ముందు వారి సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాను అప్పటివరకు వేచి ఉంటానని మంత్రితో ఆయన అన్నారు.
తొలుత మచిలీపట్నం బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జి. మధుబాబు, కార్యదర్శి కె. సుధీర్, జి. జి. కృష్ణా తదితరులు మంత్రి పేర్ని నానిను కలిశారు. మన జిల్లాలో బాస్కట్ బాల్ క్రీడ ఎంతో ప్రాముఖ్యమైన క్రీడగా ఉందని ప్రస్తుతం మన జిల్లాలోని నూజివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాలలో ఎంతో మంది క్రీడాకారులు ఈ క్రీడలో ప్రావీణ్యం చూపుచున్నారని మంత్రికి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో , దేశ స్థాయి నందు మన జిల్లా క్రీడాకారులు ఎందరో బాస్కట్ బాల్ క్రీడ ద్వారా ఉన్నత స్థాయిలలో మరియు ఉన్నత ఉద్యోగాలు పొందియున్నారు. కానీ మన జిల్లా ప్రధాన | కేంద్రమైన మచిలీపట్నం నందు బాస్కట్ బాల్ క్రీడకు సంబంధించి క్రీడా ప్రాంగణము లేక క్రీడాకారులు ఎంతో మంది ఉన్నప్పటికి క్రీడా ప్రాంగణం లేక సరియైన కోచింగ్ లేక తమ ప్రావీణ్యం ప్రదర్శించ లేకపోతున్నారని అన్నారు. గత రెండు సంవత్సరములుగా పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో 60 మంది పిల్లలకు బాస్కట్ బాల్ ఉచిత వేసవి శిక్షణ ఇస్తున్నామన్నారు. మన పట్టణంలోని స్కూల్ , కాలేజి విద్యార్ధులు వారి తల్లిదండ్రులు కూడా ఈ క్రీడ నందు వారి పిల్లలను ప్రోత్సహించుచున్నారని, తమకు 1 వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని పార్కులో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించి ఈ క్రీడను ప్రోత్సాహించాలని అభ్యర్ధించారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని వారితో మాట్లాడుతూ, మన పిల్లల్ని మనం మార్కుల కొలబద్దలుగా భావిస్తున్నామే తప్ప వారిని భావిపౌరులుగా మానవ వనరులుగా చూడటం లేదన్నారు. ర్యాంకుల సాధనలో స్కూలు, ట్యూషన్ హోంవర్కులు తప్ప వారి మానసిక వికాసానికి శారీరక వ్యాయామానికి కావలసిన ఆటలకు దూరం చేస్తున్నామన్నారు. నేటితరం పిల్లలకు ఆటలు అంటే కేవలం కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్ సెల్ఫోన్ గేమ్స్ తప్ప మరేవీ పట్టడం లేదన్నారు. మీరు మన ప్రాంత పిల్లలను క్రీడలకు మళ్లించడం అభినందనీయమన్నారు. సరైన బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుందని మంత్రి పేర్ని నాని వారిని ప్రశ్నించారు. సుమారు 11 లక్షల రూపాయలు అవుతుందని వారు అన్నారు. త్వరలో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( ముడా ) ఆధ్వర్యంలో రెండు పార్కులు నిర్మించనున్నామని అందులో ఏదైనా పార్కులో బాస్కెట్ బాల్ ఆధునిక కోర్టు నిర్మాణం తప్పక జరుపుదామని ఆయన అన్నారు.
ఏ పి ఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ ఎగ్జీక్యూటీవ్ డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నూతనంగా చేపట్టిన ఆదాం సాహెబ్ మంత్రి పేర్ని నానిను మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని మొక్కను బహుకరించారు.
స్థానిక నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన చెంచేటి నాగరాజు మంత్రి వద్ద తన ఆరోగ్య సమస్యను చెప్పుకొన్నారు. తాను గతంలో నీలిరంగు , ఫినాయిల్ తయారు చేసుకొని వాటిని ఊరూరా అమ్ముకొనేవాడినని, కొద్దికాలం క్రితం మధుమేహవ్యాధి సోకడంతో అది తీవ్రమై తన కాలు శస్త్రచికిత్స చేసి తొలగించారని, మరోకాలుకు ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబ జీవనం కష్టమైందని తనకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్ధించారు.
స్థానిక ఆదర్శనగర్ కు చెందిన కమటం విజయ కోటేశ్వరి తన భర్త సాంబశివరావుకు దివ్యాoగులకు వచ్చే పింఛన్ ఇప్పించాలని కోరింది. తన భర్త పోలీస్ కానిస్టేబుల్ గా ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారని 6 ఇంక్రిమెంట్లు కలవకపోవడం చేత తక్కువ వేతనం ఇంటికి తీసుతున్నారని ఒక మహిళ మంత్రికి తెలిపింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ కాలు విరగడంతో 2019 మార్చి నుంచి సెప్టెంబర్ నుంచి విధులకు హాజరు కాలేకపోయానని ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్స్కాండింగ్ అని ఉద్యోగం ఇవ్వడం లేదని మంత్రికి తెలిపారు.
Prajavartha Online Telugu News