-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రూ.200 కోట్ల మేర ఆదాయ లక్ష్యంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి మరియు విస్తరణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకై పెట్టుబడిదారుల సమావేశం (Investors Meet) ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోగాని, మార్చి మొదటి వారంలోగాని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలోని ఆయన చాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆయాశాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు.అనంతరం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక సంస్థ ఆదాయం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని పర్యాటక సంస్థ హోటళ్ల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.87.02 కోట్లు మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. కోవిడ్ కు ముందు ఏడాదికి దాదాపు రూ.120 కోట్ల మేర ఆదాయం వచ్చేదని, కోవిడ్ వల్ల ఈ ఆదాయం తగ్గినప్పటికీ, దాన్ని రూ.200 కోట్ల మేర పెంచే విధంగా పలు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
పర్యాటక సంస్థకు చెందిన సుమారు 48 ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీలను లీజుపై ప్రైవేటు ఏజన్సీలకు ఇవ్వడం జరిగిందని, అయితే కొన్ని ఏజన్సీలు లీజు చెల్లించడంలో వెనుకబడ్డాయని, సుమారు రూ.31.08 కోట్లు మేర లీజు బకాయిలు ప్రభుత్వానికి రావల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ ఏజన్సీలు అన్నింటికీ నోటీలుసు జారీ చేస్తున్నామని, నోటీసులు ప్రకారం సకాలంలో లీజు బకాయిలు చెల్లించని ఏజన్సీలను రద్దుచేస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా నూతనంగా నిర్మించిన 34 హోటళ్ల ఆపరేషన్ అండ్ మెయింటినెన్సును ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలువగా 18 రెస్టారెంట్లకు 50 టెండర్లు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిని త్వరలోనే పరిశీలించి ఆ 18 రెస్టారెంట్లను ఆపరేషన్ అండ్ మెయింటినెన్సు క్రింద ప్రైవేటు ఏజన్సీలకు అప్పగిస్తామని, తద్వారా ప్రభుత్వానికి రూ.1.76 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. మిగిలిన 16 రెస్టారెంట్లకు మళ్లీ టెండర్లను పిలిచి త్వరలో వాటిని కూడా ఆపరేషన్ అండ్ మెయింటినెన్సు క్రింద ప్రైవేటు ఏజన్సీలకు అప్పగిస్తామని, తద్వారా కూడా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏడు నక్షత్రాల హోటళ్లను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అయితే ఒబెరాయ్ గ్రూపు గండికోట, తిరుపతి, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంక, విశాఖపట్నంలో మరియు హైయత్ గ్రూపు విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతిలో హోటళ్లు నిర్మించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. వీటిని త్వరలోనే అమలు పర్చే విధంగా టూరిజం పాలసీ ప్రకారం స్థలాలు కేటాయించాలని ఆదేశాలను జారీచేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి చేపట్టిన పనుల్లో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తిచేసేందుకు మరియు 18 చోట్ల రిసార్టులు, హాటళ్లు, రెస్టారెంట్లు ఆధునీకరణపనులను చేపట్టేందుకు రూ.35 కోట్లను వెచ్చించేందుకు నిర్ణయించడమైందని మంత్రి తెలిపారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు చర్యలు….
రాష్ట్రంలో ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.గ్రామీణ,మండల,నియోజకవర్గ,జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభగల ఉత్తమ క్రీడాకారులను గుర్తించాలనే లక్ష్యంతో సి.ఎం.కప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఇప్పటికే శ్రీకాకుళం,విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో నిర్వహించడం జరిగిందని, మిగిలిన జిల్లాలో కూడా ఈ కోవిడ్ మూడో వేవ్ ముగిసిన అనంతరం నిర్వహిస్తామన్నారు.ఈవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ టోర్నమెంట్స్ నిర్వహించి ప్రతిభగల క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు.
జాతీయ స్థాయిలో బంగారు పతకాన్నిసాధించిన వారికి రూ.5.లక్షలు,వెండిపతకం విజేతకు 3లక్షలు,కాంస్య పతక విజేతకు 2లక్షలు నగదు పురస్కారాన్ని అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన 1,497 మంది క్రీడాకారులకు దాదాపు రూ.8.55 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలను అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
శాప్ ప్రతిపాదనల మేరకు రూ.7.50 కోట్లతో విశాఖపట్నం కొమ్మాదిలో ఈత కొలను నిర్మాణానికి, రూ.5.50 కోట్లతో కర్నూలు డి.ఎస్.ఏ. స్టేడియంలో సింథటిక్ టర్పు ఫుట్ బాల్ మైదానం, రూ.7.50 కోట్లతో కడపలో డా.వైఎస్సార్ స్పోర్ట్సు స్కూల్లో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ (8 లేన్లు), రూ.7.50 కోట్లతో ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు జిల్లా స్పోర్ట్సు విలేజ్ మొగలాయిపాలెంలో 400 మీటర్లు సింథటివ్ అథ్లెటిక్ ట్రాక్ (8 లేన్లు) ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఎస్.సి., ఎస్.టి., బి.సి. మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డు పిల్లల కోసం 8 స్పోర్ట్సు స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సంబందిత శాఖలతో కలిసి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయల సమితి సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బాలురు కొరకు మరియు పొలసానపల్లిలో బాలికల కొరకు శాప్ రెండు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News