-జయము జయము చంద్రన్న.. పాట ప్రమోషన్ కు రూ. కోట్లు ఖర్చు చేసిన సంగతి మరిచారా..?
-బీసీ మహిళ అని చూడకుండా సభలో మేయర్ ఛైర్ ను అవమానించారు
-పేపర్లు చింపి అరుపులు కేకలతో ప్రజా బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా గందరగోళం సృష్టించారు
-టీడీపీ ఫ్లోర్ లీడర్ల తీరుపై నిప్పులు చెరిగిన వైసీపీ నాయకులు పిల్లి కృష్ణవేణి, కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మీపతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాకాలు ఊదడం, భజన చేయడం తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్స్ అని వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, కార్పొరేటర్లు కుక్కల అనిత, కొండాయిగుంట మల్లీశ్వరి, ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మీపతి విమర్శించారు. తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ల విమర్శలను బుధవారం వారు ఖండించారు. వీఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశం నేపథ్యంలో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై చర్చ జరగనీయకుండా సభను అడ్డుకోవడమే కాకుండా.. మహిళ మేయర్ అని చూడకుండా ఛైర్ ను అవమానించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజానాయకురాలి పట్ల అగౌరవంగా ప్రవర్తించారన్నారు. పేపర్లు చింపి.. పోడియం దగ్గరకు వెళ్లి నానా గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. పైగా ఏ ముఖం పెట్టుకుని భజన అంటూ మరలా మాట్లాడతారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షాలను ప్రతిబింబించే విధంగా వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతుంటే టీడీపీ సభ్యులకు ఎందుకు మింగుడు పడటం లేదని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ ద్వారా తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలతో పాటుగా.. ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నగర ప్రజలు పెద్దఎత్తున సకాలంలో లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. అది జీర్ణించుకోలేకనే సభ సజావుగా సాగనివ్వకుండా సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భజన చేయడంలో తెలుగుదేశం నాయకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు సృష్టించారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మించకుండానే భజనలు చేయించుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జయము జయము చంద్రన్న.. జయము మీకు చంద్రన్న.. పాటను ప్రమోట్ చేయడానికి పోలవరం పర్యటన పేరిట రూ. వందల కోట్లు దుబారా చేశారన్నారు. కనుక భజనకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో నగర ప్రజలకు తెలుసున్నారు. గత చంద్రబాబు పాలనకు, జగనన్న ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో వీఎంసీని పూర్తిగా కుంభకోణాలకు కేరాఫ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడ్కో ఇళ్లు మొదలు బాండ్ల కుంభకోణం వరకు జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమన్నారు. వాటన్నింటిపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతి వీఎంసీ సమావేశంలోనూ చంద్రబాబుకు బాకా ఊదడం పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క రోజూ ప్రజా సమస్యలపై చర్చ జరగనివ్వలేదని.. ఆ విధంగా సభను నడిపారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రజారంజకంగా పాలన సాగిస్తూ.. అన్ని రంగాలలో మెరుగైన ప్రగతిని సాధిస్తున్నట్లు వివరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా వార్షిక బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక టీడీపీ సభ్యులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. తెలుగుదేశం నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ హయాంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం ఏమైనా ఉంటే.. అంశాల వారీగా చర్చకు రావాలని సవాలు విసిరారు. అంతేకానీ విమర్శలతో కాలయాపన చేయడం సరికాదని సూచించారు.